కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 18: హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో ఐక్యం చేసేందుకు మహనీయులు చేసిన త్యాగాలు ఆదర్శనీయమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్‌ను అభినందించారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను సన్మానించుకోవడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌లో లక్షలాది మంది గిరిజనులు, ఆదివాసీ బిడ్డలతో సమైక్యతా సభ నిర్వహించడం అభినందనీయమన్నారు. గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడంతో గిరిజనులు, ఆదివాసీల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించామన్నారు. నాటి చరిత్రను నేటి తరానికి తెలిపేందుకే ఉత్సవాలు నిర్వహించామన్నారు. అనంతరం కళాకారులు, కవులు, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. తర్వాత కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్లు కాపు సీతాలక్ష్మి, దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ ధర్మరాజు, డీపీఆర్వో శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్