‘తెలంగాణ వస్తే ఏమొస్తది..?’ అని అడిగినోళ్లకు కేసీఆర్ 24 గంటల పాటు పంటలకు ఉచితంగా కరెంట్ ఇచ్చి చూపించిండు.. ఎవుసానికి సీజన్‌కు ముందే రైతులకు పెట్టుబడి పైసలు ఇస్తున్నడు.. ఇంటింటికీ నల్లా నీళ్లు సరఫరా చేస్తున్నడు.. పండుటాకులకు పింఛను పైసలను మూడింతలు చేసిండు.. ఆడపిల్లల పెండ్లిండ్లకు మేనమామై ‘కల్యాణలక్ష్మి’ ఇస్తున్నడు.. చెరువులను బాగు చేసిండు.. వాన నీటిని ఒడిసి పట్టిండు.. పంటలకు మళ్లించిండు.. ఇప్పుడు దేశ్ కీ నేత అవుతున్నడు.. కేంద్రంలో బీజేపేయేతర ప్రభుత్వాన్ని తెచ్చేవరకు నిద్రపోడు .. దేశప్రజలందరికీ మేలు చేస్తడు’ అని ఉమ్మడి జిల్లాకు చెందిన జడ్పీటీసీలు కొనియాడారు.. కేసీఆర్ జాతీయ రాజకీ యాల్లోకి వెళ్లడాన్ని స్వాగతిస్తున్నారు.. దేశ ప్రజల భవిష్యత్తును మార్చాలని ఆకాంక్షిస్తున్నారు.. వివరాలు వారి
స్వాతంత్య్రం వచ్చినా దేశంలో ఇంకా చెప్పుకోదగ్గ అభివృద్ధి జరుగలేదు. ప్రస్తుతం దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే మార్పు సాధ్యమవుతుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అనతికాలంలోనే కేసీఆర్ అభివృద్ధి చేసి చూపించారు. ఏరాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారు. రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంటు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలతో రైతులను ఆదుకుంటున్నారు. రైతు సంక్షేమ పథకాలన్నీ దేశంలోని రైతులందరికీ అందాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ర్టాలవారు తెలంగాణ పథకాలకు ఆకర్షితులై ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళ్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా కేసీఆర్‌కే ఉంది.
– బాడిశ మహేశ్, సర్పంచ్ జానంపేట
స్వాతంత్య్రం వచ్చినా నేటికీ దేశంలో బడుగు బలహీన వర్గాలు వెనుకబాటులోనే ఉన్నాయి. దళిత, గిరిజనుల జీవన ప్రమాణాలు, వారి స్థితులపై అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ ఒక్కరే. రైతుల 24 గంటలు ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో వారికి చేరువయ్యారు. రేపటితరం కోసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఎస్సీల ఆర్థిక ప్రగతి కోసం దళితబంధు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆసరా పథకంతో చేయూతనందిస్తున్నారు. ఇది గొప్ప పథకాలుగా దేశంలో ప్రశంసలు అందుకుంటున్నాయి. దేశ రాజకీయాల్లో కేసీఆర్ గొప్పగా రాణిస్తారు. ఆయన ప్రధాని అయితేనే దేశ ప్రజలకు న్యాయం జరుగుతుంది.
– ఇస్లావత్ నామనాయక్,
బంజరా గిరిజన జాతీయనాయకుడు
దేశానికి విజన్ ఉన్న నాయకుడు అవసరం. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే ప్రపంచపటంలో మన దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురాగలరు. దేశంలోని పలు రాష్ర్టాల్లో సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉపాధి లేక తెలంగాణకు వలస వస్తున్నారు. ఉద్యమ సారథి కేసీఆర్‌కు ప్రజల కష్టాలు తెలుసు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లినట్లే దేశంలో కూడా అభివృద్ధి పరుగులు పెట్టించగలరు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్‌తోనే సాధ్యం.
-కోరెం రజినీ, ఈబయ్యారం సర్పంచ్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచాయి. ఇప్పటికీ పేదరికం పోలేదు. గ్రామాలు బాగుపడలేదు. కానీ తెలంగాణలో సీఎం కేసీఆర్ గ్రామస్వరాజ్యం తెచ్చారు. గిరిజన గూడేలు, మారుమూల పల్లెలను పంచాయతీలుగా మార్చారు. పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, డంపింగ్ యార్డులు, రైతువేదికలు, కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీ భవనాలు, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతున్నారు. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళితే దేశంలోని పల్లెలకు మహర్దశ వస్తుంది. ప్రతి గ్రామం రోల్‌మోడల్ అవుతుంది.
– కూసంపూడి రామారావు, జడ్పీటీసీ, సత్తుపల్లి
ప్రస్తుతం దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. సవాళ్లను అధిగమించి భారత్‌ను అభివృద్ధి బాటలో పయనింపజేసే సత్తా కేసీఆర్‌కు ఉంది. జాతీయ రాజకీయాలను శాశించే స్థాయికి ఆయన ఎదుగుతారు. కేవలం ఎనిమిదేళ్లలోనే రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు.జాతీయ రాజకీయాల్లోకి వెళితే దేశాన్ని ఇదే బాటలో నడిపిస్తారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వంటివి దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. దేశవ్యాప్తంగా పంటలకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిస్తానని ఇప్పటికే ఆయన ఇచ్చిన ప్రకటనకు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. ప్రజల మధ్య మత చిచ్చు పెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలంటే అందుకు కేసీఆరే నాయకుడు. – పోట్ల కవిత, జడ్పీటీసీ, కొణిజర్ల
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళితే దేశ ప్రజలందరూ ఆయనకు నీరాజనం పలుకుతారు. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేయాలని ఎంతోమంది జాతీయ నాయకులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన రాకను ప్రజలు తప్పకుండా ఆహ్వానిస్తారు. సంపూర్ణ మద్దతు ఇస్తారు. సబ్బండ వర్గాల మేలు కోరే నాయకుడు జాతీయ నాయకుడైతే అందరికీ మంచి జరుగుతుంది.
– ఇంటూరి బేబీ, జడ్పీటీసీ, కూసుమంచి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నది. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నది. వాటిని నివారించాలంటే కేసీఆర్ వంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలి. తెలంగాణను అభివృద్ధి చేసిన విధంగానే దేశాన్ని అభివృద్ధి చేయాలి. బీజేపీ దుష్టపాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలి. దేశ భవిష్యత్తును మార్చగల శక్తి కేసీఆర్‌కు ఉంది. దేశ ప్రజలు తప్పకుండా ఆయన్ను ఆదరిస్తారు.
– మరికంటి ధనలక్ష్మి,
జడ్పీ వైస్ చైర్మన్, నేలకొండపల్లి
దార్శనికత, విషయ పరిజ్ఞానం ఉన్న నేత కేసీఆర్.సమర్థంగా వనరుల వినియోగించగల సమర్థత ఆయనుకుంది. ఇప్పుడు ఆయన సేవలు, నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. ఉద్యమ నేతగా తెలంగాణను సాధించినట్లుగానే భారత్‌ను అభివృద్ధి బాటలో నడిపించాలి. వెంటనే జాతీయపార్టీ స్థాపించాలి. బీజేపీ విముక్త్ భారత్ సాధించాలి. బీజేపేతర పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ప్రజలందరికీ మేలు చేయాలి.
– పర్చగాని తిరుపతికిశోర్, జడ్పీటీసీ,
చింతకాని మండలం
కేసీఆర్ ఉద్యమనేతగా తెలంగాణను సాధించారు. ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని అభివృద్ధిలో నంబర్‌వన్‌గా నిలిపారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. అదేవిధంగా ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్లి దేశ ప్రజలకు మేలు చేయాలి. జాతీయ రాజకీయాలకు ఇదే సరైన సమయం. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించగల నాయకుడు కేసీఆర్. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఆయనకు సరిసాటి లేరు.
– పైడి వెంకటేశ్వరరావు,
జడ్పీటీసీ, దమ్మపేట
ప్రస్తుతం దేశంలో గడ్డు పరిస్థితులు ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ వైఫల్యంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పాలన గాడి తప్పింది. కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగ సంస్థలు ధారాదత్తం అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో దేశానికి కేసీఆర్ వంటి బలమైన నాయకుడు కావాలి. పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాలి. బడుగు, బలహీనవర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలి. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలి.
– మారోజు సుమలత, జడ్పీటీసీ, వేంసూరు
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ వంటి నాయకుడు ఎంతో అవసరం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రజాదరణ లేదు. మతతత్వ బీజేపీతో ప్రజలు విసిగి వేసారి ఉన్నారు. ప్రధాని మోదీ సంపన్నులకు దోచిపెడుతూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. చిన్న చిన్న దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే భారత్ మాత్రం కాషాయ నేతల దుష్టపాలన కారణంగా వెనుకబడింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, రైతాంగంపై ప్రేమ, సంక్షేమ పథకాల అమలుపై పట్టు ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే కచ్చితంగా బీజేపేయేతర ప్రభుత్వం ఏర్పాటు చేయగలరు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు నిర్మించగలరు. రైతాంగం కష్టాలు తీర్చగలరు.
– చెక్కిలాల మోహన్‌రావు, పెనుబల్లి జడ్పీటీసీ, జడ్పీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్
బీజేపీ మతతత్వ పార్టీ. గప్పాలు కొట్టే పార్టీ. అభివృద్ధి, సంక్షేమం ఆ పార్టీ నాయకులకు అవసరం లేదు. ప్రజల అవసరాలు తెలుసుకునే తీరిక వారికి లేదు. కేంద్రంలోని బీజేపీని ఇంటికి పంపాలంటే అది కేసీఆర్‌తో సాధ్యం అవుతుంది. దమ్మున్న నేత కేసీఆర్. అందుకే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. యావత్ భారతం ఇప్పుడు ఆయన వైపు చూస్తున్నది. బీజేపేయేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు కావాలని కోరుకుంటున్నది.
– కోరం కనకయ్య,
భద్రాద్రి జడ్పీ చైర్మన్,
ఉద్యమ నేతగా కేసీఆర్ తెలంగాణ సాధించారు. సీఎంగా రాష్ర్టానికి జన రంజక పాలన అందిస్తున్నారు. పక్కా విజన్‌తో ముందుకు సాగుతున్నారు. ఇదే ఒరవడిలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. దేశంలో స్థితిగతులను మార్చాలి. అంతటి సమర్థత ఆయనకు ఉంది. నిరుపేదల బాధలు, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వెళితే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బీజేపీ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యం. ప్రధాని మోదీ పాలనను గట్టిగా ప్రతిఘటిస్తున్న నాయకుడిగా ఆయన్ను దేశమంతా గుర్తించింది.
– భారత లాలమ్మ, జడ్పీటీసీ, అన్నపురెడ్డిపల్లి
బీజేపీ కబంధ హస్తాల్లో దేశం నలిగిపోతున్నది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. జాతీయ రాజకీయాల్లోకి ఇప్పుడు ఒక బలమైన నాయకుడు రావాలి. అది కేసీఆరే కావాలి. ఎనిమిదేళ్లలో తెలంగాణను అన్నిరంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిపారాయన. అదే విధంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి భారత్‌ను అభివృద్ధికి రోల్‌మోడల్ చేయాలి. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి.
– పోశం నర్సింహారావు,
జడ్పీటీసీ, మణుగూరు
ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ నియంతృత్వ పోకడలను ఎండగడుతున్న ఏకైక నేత కేసీఆర్. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా కేసీఆర్‌కు ఉంది. జాతీయ స్థాయిలో రాణించగల నేత ఆయన. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటి దేశాన్ని కార్పొరేట్ శక్తుల నుంచి విముక్తి కల్పించగలరు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భౌగోళికంగా ఉన్న వనరులపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. అలాంటి నేత జాతీయ రాజకీయాల్లోకి వెళితే తప్పకుండా ప్రజల మద్దతు ఉంటుంది. కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపించడాన్ని దేశ ప్రజలు ఆహ్వానిస్తున్నారు.
– యండపల్లి వరప్రసాద్,
జడ్పీటీసీ ఖమ్మం రూరల్
జాతీయ రాజకీయాలకు దిక్చూచి కేసీఆర్.ఆయన విజన్ ఇప్పుడు దేశానికెంతో అవసరం. బీజేపీ పాలనలో దేశం విచ్ఛిన్నమవుతున్నది. బీజేపీ పాలన ఇంకా ఎన్నో అనర్థాలు తీసుకొస్తుంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి బీజేపీకి గుణపాఠం చెప్పాలి. మతతత్వ పార్టీ కబంధ హస్తాల నుంచి దేశాన్ని కాపాడాలి. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే పార్టీని తరిమికొట్టాలి. బీజేపీ ముక్త్ భారత్ సాధించాలి. ప్రజలందరికీ మేలు చేయాలి.
– చిన్నంశెట్టి వరలక్ష్మి, జడ్పీటీసీ, అశ్వారావుపేట