సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 15: దళితోద్ధరణకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అందులో భాగంగా వారి కోసం ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఇందులో దళితబంధు పథకం ప్రతిష్ఠాత్మకమైనదని అన్నారు. వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ఇంకా అంతకుమించిన ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా భవనమైన నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని అన్నారు.
ఈ నిర్ణయం ఎంతో హర్షణీయమైనదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం బాబా సాహెబ్ విగ్రహంతోపాటు సీఎం కేసీఆర్ కటౌన్‌ను కూడా అక్కడే ఉంచి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. మహనీయుడి గొప్పతనాన్ని భావి తరాలు తెలుసుకునేలా హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారని, దానికి స్మృతివనంగా నామకరణం చేస్తున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల దేశమంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవిస్తూ పార్లమెంట్ నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెడితే సముచితంగా ఉంటుందని అన్నారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేశ్, కూసంపూడి రామారావు, నడ్డి ఆనందరావు, మల్లూరు అంకమరాజు, రఫీ, వల్లభనేని పవన్, కాలినేని వెంకటేశ్వరరావు, యాగంటి శ్రీను, రఫీ, తడికమళ్ల ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.