భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 15.(నమస్తే తెలంగాణ): జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. మూడురోజుల పాటు వేడుకలు జరుగనున్నాయి. తొలిరోజు జిల్లావ్యాప్తంగా సమైక్యతా ర్యాలీలు జరుగనున్నాయి. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తారు. ర్యాలీలో పాల్గొంటారు. ప్రజలతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గ కేంద్రంలో కనీసం 15 వేల మందితో ర్యాలీ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ర్యాలీ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో శనివారం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు జరుగనున్నాయి. మణుగూరులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియానాయక్, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, భద్రాచలంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. వేడుకల నిర్వహణను ఆర్డీవోలు నిర్వర్తిస్తున్నారు.
17 న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాలు ఆవిష్కరిస్తారు. కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జెండా ఎగురవేస్తారు. ఇదేరోజు హైదరాబాద్‌లో జరిగే గిరిజన సమ్మేళనానికి 88 బస్సుల్లో గిరిజన ప్రజాప్రతినిధులు తరలివెళ్లనున్నారు. బస్సుల్లో వసతులు, భోజన సదుపాయాలు పర్యవేక్షించేందుకు ఇప్పటికే ప్రత్యేక అధికారులు నియమితులయ్యారు. 18న ముగింపు వేడుకల్లో భాగంగా పలుచోట్ల సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన జరుగుతుంది. అధికారులు కవులను సన్మానించనున్నారు.
మామిళ్లగూడెం, సెప్టెంబర్ 15: ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల కేంద్రాల్లో శుక్రవారం భారీ ర్యాలీలు జరుగనున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాలైన ఖమ్మం, వైరా, సత్తుపల్లి, కూసుమంచి, సత్తుపల్లి కేంద్రాల్లో అధికారులు ర్యాలీలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పర్యవేక్షణకు ఇప్పటికే కలెక్టర్ వీపీ గౌతమ్ నోడల్ అధికారులను నియమించారు. శనివారం ఉదయం 9 గంటలకు ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. ముగింపు వేడుకలకు భారీగా జన సమీకరణ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మూడు రోజుల పాటు జరిగే జాతీయ సమైక్యతా వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. 17 న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. ఇదే రోజు హైదరాబాద్‌లో జరిగే గిరిజన సమ్మేళనానికి జిల్లా నుంచి 4,264 మందిని ప్రత్యేక బస్సుల్లో పంపిస్తున్నాము. ఘనంగా సమైక్యత వేడుకలు నిర్వహిస్తాం.
– భద్రాద్రి కలెక్టర్ అనుదీప్