ఖమ్మం, సెప్టెంబర్ 15: తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం, ఈ ప్రాంత విశిష్టతను చాటి చెప్పేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 18న ఖమ్మంలో పటేల్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమాల వాల్ పోస్టర్‌ను గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. ఈ ఉత్సవాలను మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలందరూ ఈ వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలని కోరారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.