ఖమ్మం, సెప్టెంబర్ 15: రాష్ట్ర నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టడం యావత్ దేశం గర్వించదగిన విషయమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు.అందుకు సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కూడా వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం యావత్ దేశానికే గర్వకారణం. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. దేశంలో సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరును వందల కోట్లతో నిర్మించిన అత్యాధునిక సచివాలయానికి పెట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. కేంద్రం కూడా నూతన పార్లమెంట్ భవనానికి బాబా సాహెబ్ పేరు పెట్టాలి.
-పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
తెలంగాణ నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం యావత్ జాతికి గర్వకారణం. చరిత్రాత్మక నిర్ణయం. తెలంగాణ సమాజం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాధాలు. దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహానీయుడు అంబేద్కర్. ఆయన పేరును సచివాలయానికి పెట్టాలని నిర్ణయించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది.
-నామా నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత
తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం హర్షణీయం. మన దేశానికి అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. అందులో పొందుపర్చిన ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సీఎం కేసీఆర్ ఆ మహానీయుణ్ని ఆదర్శంగా తీసుకున్నారు. అంబేద్కర్ గొప్పతనం భవిష్యత్ తరాలకు తెలిసేలా హైదరాబాద్‌లో 125 అడుగుల విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్ఠిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశం హర్షిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.
-వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
రాష్ట్ర నూతన సచివాలయానికి బాబాసాహెబ్ పేరు పెట్టడం భారత జాతికి గర్వకారణం. వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్. అత్యాధునిక సచివాలయానికి ఆయన పేరు పెట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ చర్యతో దళిత వెనుకబడినవర్గాల ఆత్మగౌరవం మరింత పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తోంది. ఇదే స్ఫూర్తితో పార్లమెంట్ నూతన భవనానికి కూడా కేంద్రం ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టాలి. చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
-రేగా కాంతారావు, ప్రభుత్వ విప్