మామిళ్లగూడెం, సెప్టెంబర్15 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలో 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా గురువారం ఎస్ఆర్ఎండ్బీజీఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అడిషనల్ డీసీపీ శబరీష్, ఇతర అధికారులు పరిశీలించారు. శుక్రవారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ అంబేదర్ సెంటర్ నుంచి ఎస్ఆర్ఎండ్బీజీఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ర్యాలీకి ప్రజలు భారీగా హాజరవుతారన్రాఉ. ఉదయం 9 గంటలకు ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహన ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో విద్యాశాఖ, ఆయా ఇంజినీరింగ్ అధికారులతో ‘మన ఊరు-మన బడి’ పనుల మంజూరు, పనుల రికార్డు నమోదుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా 426 పాఠశాలలను ఎంపిక చేసి, 425 పాఠశాలల్లో రూ.58,77,80,137 పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు. ఇందులో 1,466 పనులు ఉన్నట్లు తెలిపారు.
ఏఈల ద్వారా పనుల పూర్తిపై 207 పాఠశాలల్లో 323 పనులపై ఎంబీల నమోదు పూర్తయిందన్నారు. ఇంజినీరింగ్‌శాఖల వారీగా ఎంబీల నమోదుపై సమీక్షించారు. విద్యుత్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. వెంటనే లైట్లు, ఫ్యాన్ల బిగించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, సత్తుపల్లి పంచాయతీ రాజ్ ఈఈ చంద్రమౌళి, సత్తుపల్లి అర్ అండ్‌బీ ఈఈ హేమలత, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ నాగశేషు, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ ఈఈ తానాజీ, డీఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు.