ఖమ్మం, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):యావత్ భారతావని ఎదురుచూస్తోంది. సంక్షేమ సారథి.. ప్రగతి వారధి కోసం వేచిచూస్తోంది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించగల ఎకనమిస్టు కేసీఆర్ అని అభివర్ణిస్తోంది. అమాంతం పెరిగిన చమురు, నిత్యావసర ధరలను నియంత్రించగల నేర్పరి అని నినదిస్తోంది. వ్యవసాయ రంగమే దేశానికి మూలమైనందున దానికి ఉచిత విద్యుత్‌ను అనివార్యం చేశారు సీఎం కేసీఆర్. అందుకే తెలంగాణలో సాగు పనులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను తప్పనిసరి చేశారు. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరగడంతో పంజాబ్‌ను సైతం తెలంగాణ వెనక్కు నెట్టింది. ఇక పంటల సాగుకు అన్నదాతలు అప్పుల కోసం వెళ్లకుండా ‘రైతుబంధు’ ద్వారా తానే పెట్టుబడి అందించారు సీఎం కేసీఆర్. దీంతో రాష్ట్ర వ్యవసాయ విధానంలో ఈ పథకం పెనుమార్పులు తీసుకొచ్చింది. రైతుబీమా అన్నదాతల కుటుంబాలకు కొండంత భరోసానిచ్చింది. వృద్ధాప్యంలో చేతిలో కర్రలా ‘ఆసరా’నిస్తోంది. ఈ పథకాలన్నీ యావత్ దేశాన్ని ఆకర్షించాయి. ఇవన్నీ దేశంలో అమలైతే జాతి మరింత ప్రగతి సాధిస్తుంది. ఇది కేసీఆర్‌తోనే సాధ్యం. అందుకే.. ఆయన రాక కోసం భారతావని ఎదురుచూస్తోంది.
కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అధినేతో, తెలంగాణ ముఖ్యమంత్రో కాదని, ఇప్పుడు ఆయన ‘దేశ్ కీ నేత’ ని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కేసీఆర్ వంటి దార్శనికుడు దేశానికి ఇప్పుడు అత్యంత అవసరమని స్పష్టం చేస్తున్నారు. ఆయన తీసుకున్న ప్రతీ నిర్ణయంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటివి దాగి ఉంటాయని అంటున్నారు. అందుకే ఆయన తీసుకునే ఏ నిర్ణయానికైనా ప్రజామోదం ఉంటుందంటున్నారు. రాష్ర్టాల హక్కులు కాలరాస్తూ, సామాన్యులు మోయలేనంతగా ధరలు పెంచుతూ, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ, దేశ సంపదను బడాబాబులకు కట్టబెడుతూ అరాచక పాలన సాగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధీశాలి సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు.
ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడం కోసం, అన్నదాతల పెట్టుబడి సాయం అందించే ఆపన్న హస్తం కోసం, చేనేతల కార్మికులకు చేయూతనందించే భుజం కోసం, వృద్ధాప్యంలో చేతిలో కర్రలా ‘ఆసరా’నందించడం కోసం దేశ ప్రజానీకం ఎదురుచూస్తోందంటున్నారు. ఇలాంటి అద్భుత పథకాలన్నీ ఇప్పటికే తెలంగాణ అమలవుతున్నాయని, వీటిని దేశ వ్యాప్తంగా అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదని గుర్తుచేస్తున్నారు. కేసీఆర్ ద్వారా ఇవన్నీ దేశ ప్రజలకు అందితే జాతి యావత్ సంక్షేమంలో పురోగమిస్తుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవశ్యకత గురించి ప్రభుత్వ శాఖల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అధికారులు, వివిధ సంఘాల నాయకులు ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. వారి అభిప్రాయాలు, ఆకాంక్షలన్నీ వారి మాటల్లోనే..
కేసీఆర్ కోసం దేశ రైతులు ఎదురుచూస్తున్నారు..
తెలంగాణలో వ్యవసాయానికి 24 నాణ్యమైన ఉచిత విద్యుత్, పంటల పెట్టుబడి కోసం తెలంగాణ రైతులకు రైతుబంధు పథకం, ప్రమాదాల వల్ల రైతు దూరమైతే అతడి కుటుంబానికి ఆర్థిక భరోసాగా రైతుబీమా. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఇలాంటి పథకాలన్నీ దేశంలోని రైతులందరినీ ఆకర్షిస్తున్నాయి. దేశంలో మునుపెన్నడూ ఇలాంటి పథకాలు లేకపోవడం, కేసీఆర్ అమలు చేసిన ఈ పథకాలతో అన్నదాతలందరూ ఆనందంగా సాగు పనులు చేసుకోవడం వంటివన్నీ పొరుగు రాష్ర్టాల కర్షకులను ఆలోచింపజేస్తున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లోని రైతులు కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. పుష్కలమైన సాగునీటి వనరులను సమకూర్చి తెలంగాణ ఎలాగైతే సస్యశ్యామలం చేశారో దేశాన్ని, తమ రాష్ర్టాలనూ అలా చేయాలని వారు కోరుకుంటున్నారు. అందుకే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడాన్ని వారు స్వాగతిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులనూ ఆయన అక్కున చేర్చుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా వేతనాలు పెంచి వారిని ఆదుకున్నారు.
–సింగిరెడ్డి కేశవరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు, గౌరిగూడెం, సత్తుపల్లి
కేసీఆర్ నాయకత్వం జాతి భవితకు అత్యవసరం..
దేశ భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. ప్రస్తుత కేంద్ర పెద్దలు ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థనూ వదిలించుకుంటూ వాటిని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న ఈ తరుణంలో సీఎం కేసీఆర్ స్పందన ఎంతో బాగుంది. ఆయన నాయకత్వం జాతి భవితకు అత్యవసరం. ఇప్పటికే తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్.. దేశాన్ని కూడా అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన కేసీఆర్.. వాటిని రూపుమాపేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టారు. వాటిని విజయవంతంగా అమలు చేసి ప్రజల కష్టాలను తొలగించారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు వంటి పథకాలన్నీ ఉద్యమం సమయంలో కేసీఆర్ చూసిన సమస్యలను తొలగించేందుకు పురుడుపోసుకున్నవే. ఇలాంటి పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ ప్రధాని కావాలి. దేశాన్ని కూడా కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దుతారని నేను నమ్ముతున్నాను.
–సురభి నర్సింహారావు, విశ్రాంత ఉద్యోగి, కారేపల్లి
బలమైన ఫ్రంట్‌కు కేసీఆర్ నాయకత్వం వహించాలి..
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలను అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజానీకం నడ్డి విరిచేందుకు నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ అమలు చేయడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది. ఆరేళ్లు వేతన జీవులకు ఆదాయపన్ను పరిమితి పెంచక పోవడం వల్ల పెరిగిన వేతనాల్లో 30శాతం ఇన్‌కంటాక్స్ కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కార్పొరేట్లకు ఎర్ర తివాచీ పరిచి వేలకోట్ల రూపాయలు మాఫీ చేస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఒక కూటమి ఏర్పడాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి పరిస్థిల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేసి బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయాన్ని జాతీయస్థాయిలో ప్రజల ముందు ఉంచాల్సిన చారిత్రక అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, గిట్టుబాటు ధర, రైతుబంధు కార్యక్రమాలతో పాటు నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, ఐటీ, ఫార్మా రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేసీఆర్ జాతీయ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తే బలమైన ప్రత్యామ్నాయం ప్రజల ముందు ఉంటుంది.
– మోతుకూరి మధు, ప్రధానోపాధ్యాయులు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
కేసీఆర్ ప్రధాని అయితేనే దేశాభివృద్ధి..
దేశం అభివృద్ధి పథంలో సాగాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. ఆయన ప్రధాని అయితేనే తెలంగాణ మాదిరిగా దేశం సమగ్రాభివృద్ధి సాధిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నట్లుగా దేశమంతటా సంక్షేమం విస్తరిస్తుంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతుబంధు, దళితబంధు వంటి అద్భుతమైన పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. కేసీఆర్ ప్రధాని అయితే ఇలాంటి పథకాలు జాతి ప్రజలందరికీ అందుతాయి. ఇవేగాక రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అందుకని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ అధికార బాధ్యతలు చేపట్టడం ద్వారా ఇలాంటి పథకాలన్నీ దేశంలోని అర్హులందరికీ అందుతాయి. గడిచిన ఎనిమిదేళ్లలోనే అభివృద్ధిలో తెలంగాణను అగ్రభాగాన నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దే.
–మౌలానా, రిటైర్డ్ టీచర్, టేకులపల్లి
తెలంగాణ పథకాలను రైతులూ కోరుకుంటున్నారు..
అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను దేశంలోని అన్ని రాష్ర్టాల రైతులూ కోరుకుంటున్నారు. రైతు రాజ్యం కేసీఆర్‌తో సాధ్యమని వారు బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. రైతుబంధు, రైతుబీమా, సాగు నీటి పథకాలు, ఉచిత విద్యుత్ వంటివి దేశంలోని రైతులందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తేవడాన్ని, వ్యవసాయానికి సబ్సిడీలను తీసివేయడాన్ని, రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడాన్ని వారు గమనించారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టి కార్పొరేట్ సంస్థలకు సాగు భూములను కట్టబెట్టాలని కేంద్రం ఆలోచిస్తుండడాన్ని వారు తెలుసుకున్నారు. అందుకని వారు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. దేశంలో వ్యవసాయాన్ని పండుగ చేయగల నాయకుడు కేసీఆర్ మాత్రమేనని వారు విశ్వసిస్తున్నారు. అందుకే జాతీయ రాజకీయాల్లోకి ఆయన రాకను వారు స్వాగతిస్తున్నారు..
–చావా వేణు, డీసీసీబీ డైరెక్టర్, తిరుమలాయపాలెం
బీజేపీ విధానాలతో బతుకు మరింత భారం..
దేశంలో బీజేపీ ప్రభుత్వానికి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో సామాన్యుల బతుకు మరింత భారంగా మారుతోంది. ఇప్పటికే ఓ వైపు సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ధరలు, పన్నుల భారం మరింత మోపిన కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు దేశ సంపదను బడా బాబులకు దోచిపెడుతోంది. వీటన్నింటినీ అడ్డుకునేందుకు దేశంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఎంతో అవసరం. దీంతో ఇదే సమయంలో సీఎం కేసీఆర్ కేంద్రంపై సమరశంఖం పూరించారు. దీనిని గమనించిన దేశ ప్రజలందరూ బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోగల శక్తి కేసీఆర్‌కు ఉందని భావిస్తున్నారు. పైగా దేశంలో మతోన్మాదాన్ని ప్రేరేపించి బీజేపీ గురించి ప్రజలు ఆందోళనగా ఉన్నారు. ఈ సమయంలో దేశంలో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ నాంది పలకాలని వారు కోరుకుంటున్నారు. అందుకు దేశంలో బీజేపీయేతర పార్టీలు కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. –చావా శివరామకృష్ణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్, తిరుమలాయపాలెం
సీఎం కేసీఆర్‌తోనే బీజేపీకి ఆగడాలకు కళ్లెం..
కేంద్రంలోని బీజేపీ పాలకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అక్కడ ఆ పార్టీ పాలకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం. కేంద్రంలో కాషాయ పార్టీ పాలనలో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులకు మోయలేని భారాన్ని నింపుతున్నాయి. గ్యాస్ ధరనైతే అడ్డూ అదుపూ లేకుండా పెంచారు. కేవలం వంట గ్యాస్ కోసం నెలకు రూ.1000పైగా వెచ్చించడమంటే సామాన్యులకు ఎంతో కష్టం. అయితే పాలకులు గ్యాస్ ధరలు పెంచారే తప్ప తగ్గించలేదు. అదీగాక బీజేపీయేతర పార్టీలు రాష్ర్టాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోంది. ఆ రాష్ర్టాల అభివృద్ధికి నిధులు వెచ్చించడం లేదు. అయినా స్వతహాగా అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ వంటి రాష్ర్టాలను చూసి ఓర్వలేకపోతోంది. అందుకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి బీజేపీకి ప్రత్యామ్నాయం కావాలి. సంక్షేమ పథకాలను దేశమంతటికీ విస్తరించాలి.
–కుటుంబరావు, వ్యవసాయ కళాశాల విశ్రాంత ఉద్యోగి
బీజేపీ ముక్త్ భారత్.. కేసీఆర్‌తోనే సాధ్యం..
ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బీజేపీ ముక్త్ భారత్ సాధ్యమవుతుంది. ధరలు పెంచుతూ సామాన్యులపై మోయలేని భారాలు మోపుతున్న కేంద్రంలోని కాషాయ ప్రభుత్వంపై దేశ ప్రజలందరూ వ్యతిరేకతతోనే ఉన్నారు. పైగా స్వయం శక్తితో అభివృద్ధి సాధిస్తున్న చిన్న రాష్ర్టాలపై చిన్నచూపు చూస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఎదురిచండం సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం వల్ల ఇప్పటికే ఆ వివక్షను ఎదుర్కొంటున్న చిన్న రాష్ట్రాలు కలిసొస్తాయి. వాటికి కూడా న్యాయం జరుగుతుంది. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే అవగాహన ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం కావాలి. ప్రజా సమస్యలు తెలిస్తేనే అందుకు తగిన పథకాలకు రూపకల్పన చేసి సంక్షేమ ఫలాలు అందించొచ్చు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌కు మించిన వారెవరూ దేశంలో లేరు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు.
– పులి సత్యం, రిటైర్డ్ సీహెచ్‌వో, చండ్రుగొండ
కేసీఆర్‌తోనే రైతురాజ్యం..
కేసీఆర్ అంటే తెలంగాణ సాధకుడు మాత్రమే కాదు.. ఇప్పుడు దేశ్ కీ నేత. ఎనిమిదేళ్ల కాలంలోనే తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్.. మున్ముందు దేశాన్ని కూడా ప్రగతి మార్గంలో పయనింపజేయగలరు. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణలో రైతురాజ్యం అమలవుతోదంటే అది సీఎం కేసీఆర్ వల్లనే. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా దేశంలో రైతురాజ్యం వస్తుంది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని అనతికాలంలోనే దేశంలోని అనేక రాష్ర్టాలకంటే మిన్నగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పుడు తెలంగాణ వ్యవసాయం పండుగలా మారింది. వివిధ రకాల పంట ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ సరసన చేరింది. జల వనరులను సమకూర్చడంతోనే ఇది సాధ్యమైంది. ఇలాంటివన్నీ దేశంలో అమలు కావాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పుణ్యమా అని ప్రస్తుతం దేశంలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్ అందిస్తున్న పథకాలను గమనించి.. 28 రాష్ర్టాల రైతు ప్రతినిధులు ఇటీవల ఆయనను కలవడం రైతు సంక్షేమానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.
–జెన్నారెడ్డి నర్సింహారెడ్డి, రిటైర్డ్ పోలీసు ఉద్యోగుల సంఘం నాయకుడు
పోరాట పటిమ ఉన్న నాయకుడే ప్రధాని కావాలి..
పోరాట పటిమ ఉన్న నాయకుడే ప్రధాని కావాలి. అందుకు సీఎం కేసీఆరే ప్రథమ అర్హుడు. తెలంగాణ అన్ని వర్గాల ప్రజల కోసం పథకాలు అమలు చేస్తూ వారి సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్.. కేంద్రంలో అధిక బాధ్యతలు చేపట్టాలి. అప్పుడు దేశంలో కూడా సంక్షేమం వెల్లివిరుస్తుంది. పథకాలన్నీ దేశ ప్రజలందరికీ అందుతాయి. అందుకని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి. జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలి. ప్రధానమంత్రి కావాలి. ఆయన సారథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం ఆయన తీసుకున్న చర్యలు అద్భుతమైనవి. దీంతో రైతులందరూ సంతోషంగా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతు వ్యతిరేక విధనాలు అనుసరిస్తోంది. మొన్నటికి మొన్న వ్యవసాయ రంగాన్ని నట్టేట ముంచేందుకు నల్ల చట్టాలను తెచ్చింది. అనేక నెలలపాటు దేశ రైతులందరూ ఢిల్లీలో ధర్నా చేస్తేగానీ కేంద్రం తలొగ్గలేదు. అయినా ఆ చట్టాలను మళ్లీ తెస్తామని కేంద్ర మంత్రులు అప్పుడప్పుడూ రైతులను బెదిరిస్తూనే ఉన్నారు. ఇలాంటి బెదిరింపులు పోవాలంటే కేసీఆర్ ప్రధాని కావాలి.
–ఎస్కే ఖాదర్, ఆర్టీసీ రిటైర్ట్ ఉద్యోగి, మధిర
కేసీఆర్ దూరదృష్టి దేశానికి ఎంతో అవసరం..
దూరదృష్టి గల కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన ఘనత ఆయనది. సీఎంగా స్వరాష్ట్రంలో విద్యుత్, నీటి సమస్యలు సహా అనేక సమస్యలను అలవోకగా పరిష్కరించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ సేవలు దేశానికి కావాలి. సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగులు గౌరవంగా, సంతోషంగా విధులు నిర్వహిస్తున్నారు. దేశంలో సుపరిపాలన జరుగాలంటే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలి. రాష్ట్ర రైతులందరికీ సాగునీరు అందించినట్టే దేశంలోని రైతులందరికీ సాగునీటిని అందించాలి. ప్రతి ఒక్కరికీ మౌలిక వసతులు కల్పించాలి. ఇవన్నీ చేయగల సత్తా ఆయనకు ఉంది. తెలంగాణలో కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చారు. దీంతో దేశంలోని రైతులందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశమంతా అమలు కావాలంటే కేసీఆర్ దేశ రాజీకాయాల్లోకి రావడం అత్యంత అవసరం. సీఎం కేసీఆర్‌తోనే దేశంలో పెనుమార్పులు సాధ్యమవుతాయి.
–వీవీ సత్యనారాయణరెడ్డి, ఇండియన్ పోస్టల్ సర్వీస్, తెలంగాణ సర్కిల్ మాజీ డైరెక్టర్, అన్నపురెడ్డిపల్లి