కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్ 13: ‘మహిళల భద్రత మా బాధ్యత’ అంటోంది షీటీమ్. ఇందుకోసం మహిళల భద్రతా విభాగం మరింత పటిష్టంగా పనిచేస్తోంది. ఆకతాయిల ఆట కట్టించడమే లక్ష్యంగా అన్ని చర్యలూ చేపడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళల భద్రతకు షీటీమ్ పూర్తి భరోసానిస్తోంది. ఇవేగాక మహిళలు సైబర్ నేరాగాళ్ల ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఉన్నందున వారి రక్షణ కోసం అవగాహన కల్పిస్తోంది. మహిళలను ఎవరైనా వేధించినా, ఈవ్ టీజింగ్ చేసినా, ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసినా వెంటనే షీ టీమ్నుగానీ, డయల్ 100ని గానీ సంప్రదించాలని సూచిస్తోంది. ఇంకా అవసరమైతే 7901145721 నెంబరుకు నేరుగా ఫోన్ గానీ, వాట్సప్ గానీ చేయొచ్చని చెబుతోంది.
అమ్మాయిలు, మహిళల జోలికొస్తే తాట తీస్తామంటున్నది ‘ఆమె బృందం’..! అదేనండీ.. షీ టీమ్..!! పేరుకు తగ్గట్టుగానే.. ‘ఆమె’కు షీ టీమ్ (ఆమె బృందం) రక్షణ కవచంగా నిలుస్తున్నది. రాత్రీపగలు తేడా లేదు.. ఏ సమయంలో ఫిర్యాదు వచ్చినా సరే.. షీ టీమ్ సిబ్బంది తక్షణమే స్పందిస్తున్నారు. బాధితురాలిని ఆదుకునేందుకు ఆగమేఘాలపై ప్రత్యక్షమవుతున్నారు. బాధితులంతా తమలో తాము కుమిలిపోకుండా, ఏమాత్రం సందేహించకుండా, నిర్భయంగా షీ టీమ్ ఫోన్ నంబర్‌కుగానీ, డయల్ 100కుగానీ ఫిర్యాదు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వినీత్ కోరుతున్నారు.
అప్రమత్తతే అసలు రక్ష
అప్రమత్తతే అసలు రక్షణ అనే విషయాన్ని బాలికలు, యువతులు, మహిళలు గమనంలో ఉంచుకోవాలని పోలీస్ శాఖ కోరుతున్నది. ఇప్పుడు సైబర్ నేరాలు బాగా పెరిగాయి. కొందరు సైబర్ మోసగాళ్లు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ఐడీలతో ఆడవాళ్లను వలలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆడవాళ్లు అనేకమంది ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం.. సైబర్, ఇతరత్రా మోసగాళ్లు, నేరగాళ్లపై, వారి కుట్రలు-కుయుక్తులు-కార్యకలాపాలపై వారికి అవగాహన లేకపోవడమే. అందుకే, దీనిపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నది. అపరిచితులు, సైబర్ నేరగాళ్లతో ఆడవాళ్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నది.
మరింత కట్టుదిట్టం
మహిళలకు ఎటువంటి ఆప ద వచ్చినా వారికి రక్షణగా జిల్లాలో షీ టీమ్ ముందడుగు వేస్తోంది. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేకంగా షీ టీమ్ విభాగానికి ప్రత్యేక స్టేషన్‌తోపాటు, కౌన్సిలింగ్ కేంద్రం ఉ న్నా యి. షీ టీమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్గా ఆర్ఎస్సై రమాదేవి వ్యవహరిస్తున్నారు. షీ టీమ్‌లతో కలిసి ఆమె తరచూ మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేరగాళ్లు, పోకిరీల అడ్డాలను, తరచూ వేధింపులు జరిగే ప్రాంతాలను (హాట్‌స్పాట్స్)ను షీ టీమ్ అధికారులు ఇప్పటికే గుర్తించి నిఘాను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని నిరంతరం పరిశీలిస్తున్నారు.
ఫిర్యాదులు.. కేసులు
మహిళల రక్షణ కోసం జిల్లాలో షీ టీమ్ ప్రత్యేక బృందాలు నిత్యం సంచరిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో వచ్చిన 50 ఫిర్యాదులను పరష్కరించాయి. ఐదు ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, పాల్వంచ సబ్ డివిజన్లలోని షాపింగ్ మాల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, పాఠశాలలు, నిర్జన ప్రదేశాల్లో మొత్తం 76 హాట్ స్పాట్లను గుర్తించారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. షీ టీమ్‌లు నిత్యం ఈ హాట్స్పాట్లను సందర్శిస్తున్నాయి.
మహిళల భద్రతే ప్రధాన లక్ష్యం
జిల్లాలోని మహిళలు, విద్యార్థినుల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో షీ టీమ్‌లను ఏర్పాటు చేశాం. ఇవి రక్షణ కల్పించడంతోపాటు మహిళలు, విద్యార్థినులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాయి. మహిళల చట్టాలపై కళాశాలలు, పాఠశాలల్లో, మహిళలు అధికంగా ఉండే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా వేధిస్తే వెంటనే దగ్గరిలోని పోలీస్ స్టేషన్‌లోగానీ, షీ టీమ్ నంబర్ 7901145721కుగానీ, డయల్ 100కుగానీ ఫోన్ చేయొచ్చు. వాట్సాప్‌లో ఫిర్యాదు చేసినా వెంటనే స్పందిస్తాం. https://qr.tspolice.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. బాల్య వివాహాలపై ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ వినీత్, ఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం