సత్తుపల్లి, సెప్టెంబర్ 13 : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న భద్రాచలం రామాలయాన్ని కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి కాపాడాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపి కరకట్ట నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. పోలవరం ఎత్తుతో రామాలయం, గిరిజన గ్రామాలు, కిన్నెరసాని ప్రాజెక్టు సైతం ముంపునకు గురయ్యే పరిస్థితి నెలకొన్నదన్నారు. రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఆ రాముడిని కాపాడేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తూ భద్రాచలాన్ని కాపాడుకునేందుకు ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామని, అయినప్పటికీ స్పందన లేదన్నారు. దీంతో అనుభవజ్ఞులైన న్యాయమూర్తులతో సుప్రీంకోర్టులో కేసు వేశామని వివరించారు.