బూర్గంపహాడ్/ అశ్వాపురం/ మణుగూరు టౌన్, సెప్టెంబర్ 12: పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి సీఎం కేసీఆర్ జీవో 140 విడుదల చేయడం, లబ్ధిదారులకు త్వరలోనే పోడు పట్టాలు అందిస్తామని ప్రకటించడం పట్ల భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పోడు భూముల విషయం ఎన్నో ఏళ్లుగా ఆదివాసీలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు, పోడు సాగుకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ జీవోను విడుదల చేస్తున్నట్లు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆదివాసీ గూడేల్లో సుంబురాలు అంబరాన్నంటాయి. ఈ మేరకు సోమవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పోడు రైతులకు కొండంత ధైర్యాన్నిచ్చిందని అన్నారు.
అశ్వాపురంలో..: అశ్వాపురంలోని టీఆర్ఎస్ కార్యాలయంలోనూ పోడుదారులు, నాయకులు కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు..
దీర్ఘకాలంగా పోడు రైతుల కష్టాలు చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సమస్య పరిష్కారం కోసం జీవో 140ని విడుదల చేశారు. పోడుభూముల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇందుకోసం అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. దీంతో ఏజెన్సీలోని ఆదివాసీలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో ప్రకారం అర్హత కలిగిన పోడు రైతులందరికీ త్వరలోనే పట్టాలు అందజేస్తాం. ఆదివాసీల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
-ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు