మామిళ్లగూడెం, సెప్టెంబర్ 12: ఈనెల 16 నుంచి 18 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. వజ్రోత్సవాల ఏర్పాట్లపై కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. 16న ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో 15 వేల మందితో భారీ ర్యాలీ చేపట్టాలన్నారు. ర్యాలీ అనంతరం పాల్గొన్న వారందరికీ భోజన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. ర్యాలీలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు విధిగా పాల్గొనాలని సూచించారు. ప్రతి మండలం నుంచి ఒక లక్ష్యం నిర్దేశించుకొని జనసమీకరణ చేయాలన్నారు. 17న జిల్లా కేంద్రంలో జాతీయ పతాకావిషరణ కార్యక్రమం ఉంటుందన్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రాష్ట్ర రాజధానిలో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిషరించిన తర్వాత కొమురం భీం, బంజారా సంత్ సేవాలాల్ భవన్లను ప్రారంభిస్తారని అన్నారు. ఈ కార్యక్రమాలకు జిల్లాలోని ఎస్టీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఎస్టీ ప్రజలు హైదరాబాద్‌కు తరలి వెళ్లాలని సూచించారు. వీరిని తరలించేందుకు అధికారులు పకడ్బందీ కార్యాచరణ చేయాలన్నారు. ప్రతి మండలం నుంచి బస్సులను ఏర్పాటు చేయాలని, రూట్‌మ్యాప్ చేపట్టి సమయానికి గమ్యస్థానం చేరేలా కార్యాచరణ చేయాలని సూచించారు. టిఫిన్ సహా భోజన ఏర్పాట్లన్నీ చేయాలని, ఒకొక బస్సుకు ఒక అధికారిని బాధ్యుడిగా నియమించాలని సూచించారు. 18న ఖమ్మంలోని పటేల్ స్టేడియంలో పెద్ద ఎత్తున సాంసృతిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మాధసూదన్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ సురభి, ఏడీసీపీలు శబరీశ్, సుభాశ్ చంద్రబోస్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, డీఆర్డీవో విద్యాచందన, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
16 నుంచి తెలంగాణ సమైక్యతా వేడుకలు: మేయర్
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఘనంగా నిర్వహించాలని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. వజ్రోత్సవాల నిర్వహణపై కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి మాట్లాడారు. ఈ నెల 16న జిల్లా కేంద్రంలో దాదాపు 15 వేల మందితో నిర్వహించే భారీ ర్యాలీని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభిస్తారని తెలిపారు. ర్యాలీలో విద్యార్థులు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరికి సామూహిక బోజనాలను ఏర్పాటు చేశాన్నారు. 17న ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారని తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే ఉత్సవాల్లో ఖమ్మం కార్పొరేషన్‌కు చెందిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు, రఘునాథపాలెం మండలానికి చెందిన 210 మంది ఎస్టీ ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగే ఉత్సవంలో పాల్గొంటారని మేయర్ తెలిపారు. 18న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాలను అన్నింటినీ విజయవంతం చేసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేయాలని మేయర్ అన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతిమా జోహారా ముక్తార్, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేశ్, ట్రాపిక్ సీఐ అంజలి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.