ఖమ్మం, సెఫ్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశించారు. ఓ వైపు గోదావరి ప్రవాహం పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కావడం, మరోవైపు భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉండడంతో సోమవారం ఇరు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రస్తుతం క్ష్రేతస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అధికారులను సిద్ధంగా ఉంచాలని, తాను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని అన్నారు. అవసరమైన చోట వినియోగించేందుకు రెస్క్యూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. అధికారులందరూ వారి కార్యస్థానాల్లోనే ఉండాలని ఆదేశించారు.