ఖమ్మం కల్చరల్/ మామిళ్లగూడెం/ భద్రాచలం, సెప్టెంబర్ 10: ‘బొజ్జ గణపయ్యా.. మళ్లీ రావయ్యా.. ’ అంటూ భక్తగణం గణనాథుడికి సాదరంగా వీడ్కోలు పలికింది. తొమ్మిది రోజులపాటు భక్తులతో విశేష పూజలందుకున్న గణనాథుడు శనివారం వీడ్కోలు పొంది గంగమ్మ ఒడికి చేరాడు. సకల దేవతాగణాలకు అధిపతి అయిన గణనాథుడిని ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో భారీ మండపాలు, ఆకర్షణీయమైన సెట్టింగ్‌లు, చలువ పందిళ్లలో గత నెల 31న భాద్రపద శుద్ధ చవితి నాడు కొలువుదీర్చిన భక్తులు, ఉత్సవ కమిటీల బాధ్యులు నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ విఘ్ననాథులందరినీ శనివారం జిల్లాలోని పలు జలాశయాల్లో ఘనంగా నిమజ్జనం చేశారు. ఖమ్మం కాల్వొడు మున్నేరు, ప్రకాశ్‌నగర్ చప్టా వద్ద ఒక్కొక్క విగ్రహాన్ని నేత్రపర్వంగా నిమజ్జనం చేశారు. స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గాంధీచౌక్ వద్ద ఏర్పాటు చేసిన సార్వత్రిక వినాయక నిమజ్జనోత్సవ వేదిక వద్దకు ఉత్సవ కమిటీలు, భక్త బృందాల బాధ్యులు కోలాహలంగా వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. భక్త బృందాల నృత్యాలు, కీర్తనల నడుమ విగ్రహాలు నగర వీధుల గుండా కనుల పండువగా శోభాయాత్ర చేశాయి. వేద పండితుడు తాటికొండాల సీతారామశాస్త్రి అత్యంత శాస్ర్తోక్తంగా వేద మంత్రోచ్ఛారణలతో వినాయక విగ్రహాల వీడ్కోలు క్రతువును నిర్వహించారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఆర్జేసీ కృష్ణ, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు బానోతు చంద్రావతి, కార్పొరేటర్లు, నాయకులు పసుమర్తి రామ్మోహన్, కమర్తపు మురళి, ఉపేందర్, పగడాల నాగరాజు, ప్రసన్నకృష్ణ, లక్ష్మీప్రసన్న, వినోద్‌లాహోటి, కీసర జైపాల్‌రెడ్డి, గెంటేల విద్యాసాగర్, వెంపటి లక్ష్మీనారాయణ, అల్లిక అంజయ్య, మూలగుండ్ల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
మున్నేరులో నిమజ్జనోత్సవం..
స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నగరంలోని గాంధీచౌక్‌లో వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జన శోభాయాత్ర, సార్వత్రిక గణేశ్ నిమజ్జన వీడ్కోలు బహిరంగ సభలను అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం కాల్వొడ్డు మున్నేరు, ప్రకాశ్‌నగర్ చప్టా వద్ద విగ్రహాలను నిమజ్జనం చేశారు. కాల్వొడ్డు నిమజ్జన ఘాట్ వద్ద ఒక్కో విగ్రహాన్ని క్రేన్ సహాయంతో మున్నేరులో నిమజ్జనం గావించారు. ఈ దఫా అధికంగా మట్టి విగ్రహాలే ఉండడంతో అవన్నీ నీటిలో తేలికగా మునిగి కరిగిపోయాయి. ఖమ్మంలో ఏర్పాటు చేసిన
నిమజ్జనోత్సవాన్ని భక్తులందరూ మున్నేరు బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద నుంచి తిలకించారు. ఖమ్మం మున్నేరు వద్ద నిర్వహించిన నిమజ్జనోత్సవాన్ని మంత్రి అజయ్‌కుమార్ పరిశీలించారు. పోలీస్ అధికారులు రూపొందించిన రూట్‌మ్యాప్ ప్రకారం వినాయక విగ్రహాలు నగరం నలుమూలల నుంచి శోభాయాత్రగా తరలివచ్చాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నిమజ్జన వేడుక కనుల పండువగా సాగింది. సాయంత్రం నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ గణపయ్యల శోభాయాత్ర, నిమజ్జనం నిరాటంకంగా కొనసాగింది.
ఖమ్మంలో పర్యవేక్షించిన కలెక్టర్, సీపీ
ఖమ్మం కాల్వొడ్డు, ప్రకాశ్‌నగర్ ప్రాంతాల్లోని మున్నేరు వద్ద గణేశ్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, కేఎంసీ కమిషనర్ పర్యవేక్షించారు. వర్షంలోనూ పర్యటిస్తూ అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.
భద్రాచలంలో..
భద్రాచలం వద్ద గోదావరి నదిలోనూ నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ విఘ్ననాథుల నిమజ్జనం నిర్విఘ్నంగా జరుగుతోంది. భద్రాచలం గోదావరిలో నిమజ్జనం చేసేందుకు వివిధ జిల్లాల నుంచి సుమారు 3500 విగ్రహాలను తీసుకొస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా డివైడర్ల మధ్య బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి భద్రాచలం వచ్చే వాహనాలు సీఆర్పీఎఫ్ క్యాంపు వద్ద యూటర్న్ తీసుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న కరకట్టపైకి చేరుకోవాలి. అక్కడ క్రేన్ల సాయంతో వినాయక విగ్రహాలను వాహనంపై నుంచి కిందకు దింపుతున్నారు. అక్కడ నుంచి మళ్లీ క్రేన్ల సాయంతో లాంచీల పైకి ఎక్కించి గోదావరి మధ్యభాగంలోకి తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేస్తున్నారు.