గవర్నర్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా అనుచితంగా మాట్లాడారని విశ్లేషకులు వెల్లడించారు. గవర్నర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రి అజయ్‌కుమార్, ఉభయ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు తాతా మధు, రేగా కాంతారావు డిమాండ్ చేశారు.
– ఖమ్మం, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
గవర్నర్ వ్యాఖ్యలు సరైనవి కావు
రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై స్థాయి మరచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని యావత్ భారత్ కోరుకుంటున్నది. కేసీఆర్ జాతీయ స్థాయిలో కేంద్ర బిందువుగా మారుతున్న సమయంలో గవర్నర్ వ్యాఖ్యలు ఆక్షేపనీయం. ఆమె వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించేలా ఉన్నాయి. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. రాజ్‌భవన్ రాజకీయ భవన్‌గా మారిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడకముందే గవర్నర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.
– పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి
నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరు..
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు ఆమె హుందాతనాన్ని తగ్గించేలా ఉన్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరు. రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్న తరుణంలో గవర్నర్ వ్యాఖ్యలు శోచనీయం. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ప్రజలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరం. – తాతా మధు,టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
మనోభావాలు దెబ్బతీస్తే ప్రజలు సహించరు..
రాజ్‌భవన్‌ని గవర్నర్ తమిళిసై రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్‌భవన్ రాజకీయ కేంద్రంగా మారుతుండడం బాధాకరం. గవర్నర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో దురుసుగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగేతర శక్తిగా మారారు. ఆమె రాజకీయాలు చేయాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా కొనసాగుతున్న గవర్నర్ పదవికి తక్షణం రాజీనామా చేయాలి. మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు సహించరు. ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి గవర్నర్ బీజేపీకి ఏజెంట్లా వ్యవహరించడం శోచనీయం. అలా చేయడం తన కన్నును తానే పొడుచుకోవడంతో సమానం.
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు