రామవరం, సెప్టెంబర్ 5: మైనింగ్ అంటేనే కాలుష్య కారకం. అందులోనూ భూగర్భంలోని బొగ్గును వెలికితీయడమంటే పర్యావరణానికి అన్ని విధాలా చేటే. మరి ఇలాంటి క్లిష్ట విధానాల్లోనూ కాలుష్య నివారణకు పాటుపడుతోంది సింగరేణి సంస్థ. మైనింగ్ చేస్తూనే.. దాని వల్ల పర్యావరణానికి కలిగే ప్రమాదాలను నివారించేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఇందుకుగాను జాతీయ ఉత్తమ పర్యావరణ రహిత మైనింగ్ అవార్డు సొంతం చేసుకుంది సింగరేణి కొత్తగూడెం ఏరియాకు చెందిన పీవీకే 5 గని. అంతేగాక కోలిండియాకూ ఆదర్శంగా నిలిచింది. గనిలోని పని ప్రాంతాల్లో ఆటోమేటిక్ డస్ట్ సపరేషన్ సిస్టమ్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక ప్లాంటేషన్ ఏర్పాటు చేసింది. ఇంకా ట్రీట్మెంట్ ప్లాంటేషన్, క్లోనల్ ప్లాంటేషన్, శాండ్ స్టోయింగ్, ఫ్లైయాష్ ఫిల్లింగ్, కంటీన్యూయస్ మైనింగ్ టెక్నాలజీ వంటి వాటిని వినియోగిస్తూ పర్యావరణానికి ఏ మాత్రమూ చేటు కలిగించకుండా బొగ్గును వెలికితీస్తోంది. ఇందుకు లభించిన జాతీయ స్థాయి ఉత్తమ పర్యావరణ రహిత మైనింగ్ అవార్డును న్యూఢిల్లీలో ఈ నెల 2న జరిగిన 56వ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మైనింగ్ ఇండస్ట్రీస్ జనరల్ బాడీలో కేంద్ర గనుల శాఖ కార్యదర్శి అలోక్ టండన్ నుంచి గని అధికారులు అందుకున్నారు.
బొగ్గు రవాణా వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారించేందుకు సింగరేణి అధికారులు తీసుకుంటున్న చర్యలు కోల్ఇండియా వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. యాజమాన్యం సూచనలను అధికారులు కచ్చితంగా అమలు చేస్తుండడం వల్లనే ఈ ఏరియా ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. గనిలోని పని ప్రాంతాల్లో ఆటోమేటిక్ డస్ట్ సపరేషన్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక ప్లాంటేషన్‌కు చర్యలు తీసుకున్నారు. 1952లో ప్రారంభమైన ఈ గని గత 70 ఏళ్ల కాలంలో సింగరేణి సంస్థ సాధిస్తున్న ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తోంది. పర్యావరణ చర్యలోనూ ముందుంటోంది. గనికి అనుబంధంగా ఉన్న 147 హెక్టార్ల భూమిలో దాదాపు 80 హెక్టార్లలో భారీ ఎత్తున ప్లాంటేషన్‌ను చేపట్టి మొక్కలను వనాలుగా పెంచుతోంది. సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే 5 ఇైంక్లెన్ భూగర్భగనికి జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యావరణ రహిత మైనింగ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఈ నెల 2న జరిగిన 56వ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మైనింగ్ ఇండస్ట్రీ జనరల్ బాడీ సమావేశంలో కేంద్ర గనుల శాఖ కార్యదర్శి అలోక్ టండన్ నుంచి గని ఏజెంట్ బూర రవీందర్, మేనేజర్ పాలడుగు శ్రీనివాసరావులు ఈ అవార్డును అందుకున్నారు.
కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు
బొగ్గు రవాణా ప్రాంతంలో ధూళి నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ ప్లాంటేషన్, క్లోనల్ ప్లాంటేషన్ లాంటివి చేపట్టారు. ఈ గని నుంచి వచ్చే నీటిని ఫిల్టర్‌బెడ్ ద్వారా శుద్ధి చేసి బయటికి పంపిస్తుండగా.. ఆ నీటిని ధూళి నివారణ, శాండ్ స్టోయింగ్, మొక్కలకు వినియోగిస్తున్నారు. ఈ గనిలో ఖాళీ అయిన ప్రాంతాలను నదుల ఇసుకతోగాక కేటీపీఎస్, నవభారత్ పరిశ్రమల నుంచి వచ్చే ఫ్లైయాష్‌తో నింపుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఈ గనిలో ప్రధానంగా కంటీన్యూయస్ మైనర్ టెక్నాలజీని వినియోగించడం వల్ల పూర్తి పర్యావరణ రహిత బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రక్రియ వల్ల ఇతర గనుల మాదిరిగా గనుల్లో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ లాంటివి నిర్వహించాల్సిన పనిలేదు. అంతేకాకుండా గార్లెన్డ్ డ్రెయిన్లు, ఇంకుడుగుంతల లాంటివి కూడా ఏర్పాటు చేశారు. పర్యావరణ చర్యలతో గని నుంచి సురక్షితంగా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని సింగరేణి అధికారులు తెలిపారు.
అవార్డు రావడం మొదటిసారి
దేశ వ్యాప్తంగా ఉన్న భూగర్భగనుల్లో పీవీకే 5 గనికి పర్యావరణ రహిత అవార్డు రావడం సంతోషాన్ని కలిగించింది. సింగరేణి వ్యాప్తంగా కోయగూడెం ఓసీ, పద్మావతిఖని దరఖాస్తు చేసుకోగా పీవీకే 5 గనిని ఎంపిక కావడం సంతోషాన్ని కలిగించింది. సింగరేణి వ్యాప్తంగా 18 ఓపెన్‌కాస్టు గనులు, 24 భూగర్భ గనులు ఉన్నప్పటికీ మా గనికి ఈ అవార్డు రావడానికి పీవీకే సమష్టి కృషే కారణం.
–బూర రవీందర్, గని ఏజెంట్
హరితహారమే మాకు ఆదర్శం
హరితహారం స్ఫూర్తితోనే మొక్కలు నాటగలిగాం. ఈ గనిలో బొగ్గు రవాణా బెల్టు పూర్తిగా ద్వారానే జరుగుతుంది. ఉత్పత్తి నుంచి రవాణా వరకు పర్యావరణ రహిత విధానమే మాకు ఈ అవార్డును తెప్పించి పెట్టింది. యాజమాన్యం చెప్పిన దిశానిర్దేశాన్ని అనుసరిస్తూ పర్యావరణ రహిత చర్యలను చేపట్టడం వల్లనే ఈ అవార్డు లభించింది.
–పాలడుగు శ్రీనివాస్, గని మేనేజర్