ఆ పల్లెలో అడుగుపెడితే స్వచ్ఛ పరిమళాలు స్వాగతం పలుకుతాయి. పచ్చదనం కనువిందు చేస్తుంది. గత పాలకుల హయాంలో సమస్యలతో సతమతమైన ఆ గ్రామంలో.. ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో గ్రామాభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పంచాయతీ అయినా పారిశుధ్య చర్యల్లో నవంబర్ వన్‌గా నిలుస్తున్నది. హారతహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదం పంచుతున్నది. ఇంతకీ ఆ పల్లె ఎక్కడుంది.? అక్కడ జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోవాలంటే భద్రాద్రి జిల్లా దమ్మపేట మేజర్ పంచాయతీని సందర్శించాల్సిందే.. – దమ్మపేట, సెప్టెంబర్ 3
దమ్మపేట, సెప్టెంబర్ 3 : మండల కేంద్రంగా ఉన్న దమ్మపేట మేజర్ పంచాయతీ ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పంచాయతీ పల్లెప్రగతిలో భాగంగా ఎంతో అభివృద్ధి సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం రెండు ట్రాక్టర్లు, వాటర్‌ట్యాంకు, ట్రక్కుతో కలిపి మొత్తం రూ.15.50 లక్షలు కేటాయించింది. ఈ నిధులను సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం పారిశుధ్యం, హరితహారం కార్యక్రమానికి వినియోగిస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా నిత్యం ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరించి పంచాయతీని స్వచ్ఛత దిశగా నడుపుతున్నారు. హరితహారంలో భాగంగా ప్రధాన రహదారి డివైడర్ మధ్యలో రూ.2 లక్షలతో నాటిన మొక్కలకు ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు నీటిని అందిస్తున్నారు.
స్వచ్ఛత దిశగా పంచాయతీ
దమ్మపేట మేజర్ పంచాయతీ కావడంతో కార్యదర్శి పసుపులేటి కృష్ణ పాలకవర్గం సహకారంతో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. హరితహారంలో నాటిన మొక్కలకు అనునిత్యం నీటిని అందిస్తుండడంతో పంచాయతీ స్వచ్ఛత వైపు పరుగులు తీస్తున్నది. ఈ పంచాయతీకి రెండు ట్రాక్టర్లను కేటాయించడంతో వాటి ద్వారా ఇటు పారిశుధ్యం, అటు హరితహారంలో నాటిన మొక్కలకు డోకా లేకుండాపోయింది. దీంతో పంచాయతీ పచ్చదనంతో కళకళలాడుతున్నది.
నిత్యం అధికారుల పర్యవేక్షణ
దమ్మపేట పంచాయతీ అభివృద్ధిలో దూసుకెళ్లడానికి ప్రధాన కారణం అధికారుల పర్యవేక్షణ, ప్రజా ప్రతినిధుల సమష్టి నిర్ణయాలు. పంచాయతీలో ప్రజ లకు ఎలాంటి ఇబ్బందులున్నా వాటి పరిష్కారానికి తమవంతు సహాయం అందిస్తున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రజాప్రతినిధులు మంచినీటి ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేశారు. మండల కేంద్రంలో చెత్తచెదారం లేకుండా ఉండేందుకు ప్రతి నిత్యం పారిశుధ్య పనులను సిబ్బందితో చేయిస్తున్నారు. గత వేసవిలో హరితహారం మొక్కలకు ప్రతిరోజు నీటిని అందించడంతో ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి.
పచ్చదనంలో ఫస్ట్
దమ్మపేట పంచాయతీ పచ్చదనంతో మెరుస్తున్నది. హరితహారంలో భాగంగా గతంలో నాటిన మొక్కలతోపాటు తాజాగా డివైడర్ మధ్యలో మొక్కలు, పంచాయతీలోని ప్రధాన రహదారికి ఇరువైపులా 1,500 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టారు. హరితహారంలో భాగంగా కోనోకర్పస్ 900 మొక్కలు, బోగం విలయ 300, గన్నేరు 300 రకాల మొక్కలను ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చారు. దమ్మపేట పంచాయతీ అటు పారిశుధ్యం, ఇటు హరితహారంలో పచ్చదనంగా మారి ప్రగతి వైపు పయనిస్తున్నది.
గ్రామస్తుల సహకారంతో మరింత అభివృద్ధి
ప్రభుత్వ నిధులు సకాలంలో సమకూరుతుండడంతో దమ్మపేట పంచాయతీలో అభివృద్ధి గణనీయంగా జరుగుతున్నది. ముఖ్యంగా గ్రామస్తుల సహకారంతో పంచాయతీ మరింత అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. గ్రామ ప్రజలు ఇంటి, నీటి పన్నులు సకాలంలో చెల్లిస్తుండటంతో ‘పల్లె’ప్రగతి సాధిస్తున్నది. ప్రజా సమస్యలను పంచాయతీ పాలకవర్గం తక్షణమే పరిష్కరిస్తున్నది. పారిశుధ్యం విషయంలో పాలకవర్గం, సిబ్బంది పనితీరు చాలా బాగుంది. హరితహారం మొక్కలకు నిత్యం నీటిని అందిస్తూ సంరక్షిస్తున్నాం.
– పసుపులేటి కృష్ణ, పంచాయతీ కార్యదర్శి, దమ్మపేట