భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నాడు దండుగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారు సీఎం కేసీఆర్.. ఆరుగాలం కష్టించే అన్నదాతకు అండగా నిలిచారు. సాగునీటి కష్టాలు తీర్చి కర్షకుల పాలిట అపర భగీరథుడయ్యారు. పెట్టుబడి భారంగా మారి మరణమే శరణమనుకున్న రైతులకు ‘రైతుబంధు’ పథకంతో ఆత్మబంధువు అయ్యారు. సాగుకు సరిపడినన్ని ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడంతో రైతులు సంబురంగా సాగులోకి దిగుతున్నారు. గతంలో వ్యవసాయాన్ని వదిలి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు తిరిగి స్వగ్రామం చేరుకుని సాగు బాట పడుతున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో నిరుడు 3.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. ఈ ఏడాది 4 లక్షల మేర సాగు చేయనున్నారు. ఇప్పటికే 1,99,169 ఎకరాల్లో పంటలను సాగు చేశారు. అదునుకంటే అదనంగా వర్షాలు కురవడం, ప్రభుత్వం నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందుతుండడంతో పంటల సాగు పండుగలా సాగుతోంది.
అదునుకంటే అదనంగా వర్షాలు కురవడం, ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతుండడంతో భద్రాద్రి జిల్లాలో పంటల సాగు పండుగలా సాగుతోంది. ఒక్కోసారి విపత్తులు వచ్చి కొంత మేరకు నష్టం జరిగినా, తరువాత ఊహించని గిట్టుబాటు ధరల వంటివి రైతన్నను ఆదుకుంటూనే ఉన్నాయి. అందుకే నిరుటి నుంచి మిర్చి, పత్తి పంటలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దానికి తోడు ఈ ఏడాది సాధారణ వర్షపాతాన్ని మించి 53 శాతం అదనంగా కురిసింది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 4 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటికే 1,99,168 ఎకరాల్లో పంటల సాగు చేశారు. చెరువులు, కుంటలు, మోటర్లు ఉన్న ప్రాంతాల్లో వరి సాగు ముమ్మరంగా జరుగుతోంది. ఎటు చూసినా పంట పొలాల్లో కూలీలు నాట్లు వేస్తూ, కలుపు తీస్తూ కన్పిస్తున్నారు.
ఇప్పటికే 1,99,169 ఎకరాల్లో..
నిరుడు మిర్చి, పత్తి పంటలకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో రైతులు ఈ ఏడాది కూడా అవే పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో నిరుడు 3.50 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేయగా ఈ ఏడాది 4 లక్షల మేర సాగు చేయనున్నారు. ఇప్పటికే 1,99,169 ఎకరాల్లో పంటలను సాగు చేశారు. పత్తి 1,07,587, వరి 49,454, మొక్కజొన్న 24,294, కంది 3,345, పెసర 584, జీలుగు 10,803, జనుము 224, పిల్లిపెసర 1,070 ఎకరాల్లో సాగు చేయగా మిరప పంట కోసం 1600 ఎకరాల్లో మొక్కలు వేశారు. వచ్చే నెల కల్లా పత్తి మరో 50 ఎకరాలు, వరి ఇంకో లక్ష ఎకరాలు పోగా మిర్చి సహా మిగిలిన పంటలు మిగతా పంటలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.
వచ్చే నెలకల్లా బుకింగ్..
రైతు వేసిన ప్రతి పంటను వ్యవసాయశాఖ నమోదు చేస్తోంది. క్రాప్ బుకింగ్ చేసిన పంటలను మాత్రమే వ్యవసాయశాఖ అధికారికంగా నమోదు చేస్తారు. సాగు చేసిన ఏ రైతూ నష్ట పోకుండా ప్రభుత్వం క్రాప్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్లో గిట్టుబాటు ధరలు ఉన్న పంటలను మాత్రమే సాగు చేసేందుకు రైతుల అభిప్రాయాలను సేకరించి వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ విధానాన్ని తేవడంతో రైతులు ఎక్కువస్థాయిలో ఒకే పంటను వేయకుండా అవసరాలను బట్టి వివిధ పంటల సాగు చేస్తున్నారు.
అదునుకు అదనంగా వర్షపాతం..
వర్షాలు కూడా నిరుటి కంటే అధికంగా కురిశాయి. వరదల కారణంగా గోదావరి పరివాహకంలోని మండలాల్లో కొంత మేరకు పంటలు నష్టపోయినా ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షాలు పంటలకు చాలా వరకు ఉపయోగపడ్డాయి. నిరుడు సాధారణ వర్షపాతం 723 మిలీ మీటర్లకు గాను 805 మిలీ మీటర్లు నమోదైంది. అంటే 12 శాతం వర్షం మాత్రమే ఎక్కువగా కురిసింది. ఈ ఏడాది 723 మిల్లీ మీటర్లకు గాను 1,106 మిల్లీ మీటర్ల కురిసి 53 శాతం అధికంగా నమోదైంది.
సకాలంలో మంచి వర్షాలు..
ఈ ఏడాది మంచి వర్షాలు కురిశాయి. పంటలు కూడా బాగా పండుతాయి. నిరుడు పత్తికి రేటు బాగా ఉంది. నేను మూడెకరాల్లో పంటను వేశా. రైతుబంధు సాయం కూడా అందింది. ఇప్పుడు ఇంకొంచెం వర్షం పడితే పంటలు ఇంకా బాగుంటాయి. వ్యవసాయ అధికారులు పంటల వద్దకు వచ్చారు. ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేస్తున్నానో అడిగి రాసుకొని వెళ్లారు.
–భూక్యా రాములు, రైతు, కొమ్ముగూడెం,
పత్తి, మిర్చి పంటలు వేశాను..
ఎకరంలో మిర్చి వేశా. మూడెకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. రైతుబంధు వచ్చింది. పెట్టుబడికి చాలా ఉపయోగపడింది. మొన్నటి వరకు వర్షాలు బాగా కురిశాయి. అదును చూసి పంటలను వేశా. ఈసారి పంటలకు ధరలు బాగుంటాయని రెండు రకాల పంటలు వేశాను. అధికారులు పంట గురించి సలహాలు ఇచ్చారు. వారి చెప్పినట్టే సాగు చేస్తున్నాను.
–భూక్యా భీమా, రైతు, కొమ్ముగూడెం
నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు..
భద్రాద్రి జిల్లాలో ఈ ఏడాది రైతులు సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 లక్షల వరకు క్రాప్ బుకింగ్ అయింది. అ నెల చివరి కల్లా మరో 1.50 లక్షల ఎకరాలు బుకింగ్ ఆవుతుంది. వచ్చే నెలలో పూర్తిగా పంటల సాగు నమోదు కానుంది. అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలోనూ రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని జమ చేశాం.
–కొర్సా అభిమన్యుడు, డీఏవో, భద్రాద్రి