ఖమ్మం రూరల్, ఆగస్టు 29 : సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తం మరో 10 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయడంతో రూరల్ మండలంలో పండుటాకులు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మండలంలో నూతనంగా 2,361 మందికి ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. వారం రోజుల క్రితం నుంచి ఆయా పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్‌లకు మంజూరు జాబితా ఇవ్వడంతో గ్రామాల్లో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, గీత కార్మికుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఇప్పటికే వేలాది మందికి ప్రభుత్వం నెలకు రూ.2 వేల చొప్పున పింఛన్ అందజేస్తున్నది. కొత్తగా 57 సంవత్సరాలు నిండిన వారికి సైతం ప్రభుత్వం పింఛన్ అందజేస్తున్నది. మండలవ్యాప్తంగా 1,215 మంది వృద్ధులకు లబ్ధి చేకూరనున్నది. పింఛన్‌దారుల వయస్సు సైతం తగ్గించడంతో గ్రామాల్లో అన్నివర్గాల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
గ్రామాల వారీగా పింఛన్ల వివరాలు
మండలంలోని 29 గ్రామాల్లో 2,361మందికి పింఛన్లు మంజూరయ్యాయి. ఆరెకోడులో 68 మందికి, ఆరెంపులతండా పంచాయతీ పరిధిలో 26 మందికి, ఆరెంపుల గ్రామానికి 68, బారుగూడెం 46, చింతపల్లి 37, ఏదులాపురం 217, గొల్లగూడెం 25, గోళ్లపాడు 84, గుదిమళ్ల 191, గూడూరుపాడు 52, గుర్రాలపాడు 41, కాచిరాజుగూడెం 77, కొండాపురం 64, ఎంవీపాలెం 09, ఎం వెంకటయపాలెం 127, మద్దులపల్లి 61, మంగళిగూడెం 98, ముత్తగూడెం 160, పల్లెగూడెం 73, పెద్దతండ 169, పోలెపల్లి 104, పోలిశెట్టిగూడెం 23, పొన్నెకల్ 67, సీతరాంపురం 21, తల్లంపాడు 161, తనగంపాడు 57,తెల్దారుపల్లి 123, తీర్థాల 89, వెంకటగిరి గ్రామంలో మరో 23 మందికి నూతన పింఛన్లు మంజూరయ్యాయి. వీటిలో 346 మంది దివ్యాంగులు. 23 మంది ఒంటరి మహిళలు, 65 సంవత్సరాలు పైబడినవారు 180 మంది, 57 సంవత్సరాలు పైబడినవారు 1,215 మంది, గీతకార్మికులు 41 మంది, వితంతువులు 544 మంది, ఇతర కేటగిరీలకు సంబంధించిన వారు మరో 12 మందికి పింఛన్లు మంజూరయ్యాయి.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
గోళ్లపాడు గ్రామంలో పింఛన్‌దారులు సీఎం కేసీర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నూతనంగా మరో 84 మందికి పింఛన్లు మంజూరు కావడంపై సర్పంచ్ కళ్లెం వెంకటరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొప్పుల ఆంజనేయులు, గుండు శ్రీను, సింగిరెడ్డి నర్సింహారెడ్డి, టీ ఉపేందర్, కిశోర్‌రెడ్డి, పీ సుదర్శన్, తేజావత్ జోగ్యానాయక్, తొండల రవి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకు
ఏ ఇంటి తలుపుతట్టినా సీఎం కేసీఆర్ గురించే చర్చ. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు సీఎం కేసీఆర్ ఇంటికి పెద్దకొడుకులా బాధ్యత తీసుకున్నారు. ఆసరా పింఛన్ రూ.2 వేలు అందుతుండడంతో పింఛన్‌దారులు సంతోషంగా ఉన్నారు. వృద్ధుల ఆలన, పాలన గతం కంటే ఇప్పుడు మెరుగైంది.
–కళ్లెం వెంకటరెడ్డి(సర్పంచ్-గోళ్లపాడు)