సత్తుపల్లి టౌన్, ఆగస్టు 29: మన తెలుగు సంవత్సరాల సంఖ్య ఎంత..? వాటి పేర్లు ఏమిటి..? మన దేశానికి ఇప్పటివరకు ఎంతమంది ప్రధానులు, రాష్ట్రపతులుగా ఉన్నారు..? వారి పేర్లేమిటి..? మన దేశ స్వాతంత్య్ర సమరయోధుల నాయకుల పేర్లు కొన్నయినా చెప్పగలరా..? మన దేశంలోని రాష్ర్టాలు, వాటి రాజధానులు ఏవేవి..?
lఈ ప్రశ్నలేమిటని అనుకుంటున్నారు కదూ..! వీటికి మీరు వెంటనే, తడుముకోకుండా, ఎక్కడా చూడకుండా సమాధానం చెప్పగలరా..?! కష్టమే కదా..! కానీ, ఇక్కడి ఫొటోలోని బుడ్డోడిని చూశారు కదా.. వాడు మామూలోడు కాదండోయ్..!! పై ప్రశ్నలన్నింటికీ ఏమాత్రం తడుముకోకుండా, చకచకా..టకటకా సమాధానం చెప్పేయగలడు. అది కూడా కేవలం కొన్ని సెకండ్లలోనే..! ఈ బుడ్డోడి ‘మెమొరీ’ గురించి తెలుసుకున్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు మొదట నమ్మలేదు. పరీక్ష పెట్టారు. మనోడు గుక్క తిప్పుకోకుండా గడగడమని సమాధానాలు చెప్పేశాడు. అంతే.. ఈ బుడ్డోడి పేరును, విశేషాలను తమ రికార్డ్స్ బుక్‌లోకి ఎక్కించేశారు. ఇంతకీ వీడి వయసెంతో చెప్పలేదు కదూ.. కేవలం తొమ్మిదేళ్లు. సత్తుపల్లిలోని విశ్వశాంతి విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతున్న ఈ బుడ్డోడి పేరు బొర్రా మన్విత్ జగన్నాధ్. ఇతడి రికార్డుల గురించి తెలుసుకున్న వారంతా ఆశ్చర్యంగా..
‘రికార్డుల బొర్రా..మెమొరీ బుర్ర..!’
అంటూ అభినందిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు.ఇంట్లో ప్రోత్సాహం.. బడిలో సహకారం
కొందరు పిల్లల్లో సహజంగానే అసాధారణ ప్రతిభ, జ్ఞాపక శక్తి వంటి కొన్ని రకాల ప్రత్యేకతలు ఉంటాయి. వీటిని తల్లిదండ్రులు గుర్తించి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తే, ఉపాధ్యాయులు సహకారమందిస్తే.. ఆ పిల్లలు అద్భుతాలు సాధించగలుగుతారు. మన్విత్ విషయంలో అదే జరిగింది. సత్తుపల్లికి చెందిన న్యా యవాది బొర్రా వెంకట్రావు-జ్యోతి దంపతుల కుమారుడైన మన్వి త్.. స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో 4వ తరగతి చదువుతున్నాడు.
2019లో తొలిసారిగా..
చిన్నారి మన్విత్, తన జ్ఞాపక శక్తితో 2019లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. మన దేశ ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, రాష్ర్టాలు, రాజధానులు, స్వాతంత్య్రోద్యమ నాయకులు, ప్రముఖ వ్యక్తులు.. ఇలా అనేకమైన ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా చకచకా సమాధానం చెప్పడం ద్వారా ‘మల్టీ టాలెంట్ కిడ్’గా 2019లో హైదరాబాద్‌లో ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ సాధించాడు.
గత ఏడాది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్..
కరోనా కల్లోలం వచ్చినప్పుడు పాఠశాలలన్నీ మూతపడ్డాయి. పిల్లలంతా ఇంటికే పరిమితమయ్యారు. అప్పుడు మన మన్విత్, క్రమం తప్పకుం డా ఆన్లైన్ క్లాసులకు హాజరవుతూనే, వివిధ అంశాలపై పట్టు సాధించాడు. తెలుగు సంవత్సరాల పేర్లను (మొత్తం 60) కేవలం 22 సెకండ్లలో చెప్పడం ద్వారా 2021 మే నెలలో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో పేరు నమోదు చేసుకున్నాడు.
ప్రస్తుతం అబ్దుల్ కలాం వరల్డ్ రికార్డ్స్..
మోడ్రన్ పీరియాడిక్ టేబుల్‌కు సంబంధించి 118 ఎలిమెంట్స్ పేర్లను కేవలం 44 సెకన్లలో చెప్పడం ద్వారా అబ్దుల్ కలాం వరల్డ్ రికార్డ్స్ (చెన్నై)లోనూ మన్విత్ పేరు నమోదైంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడైన డాక్టర్ కుమార్ వెల్ నుంచి ప్రశంసాపత్రం, జ్ఞాపిక, మెడల్, బ్యాడ్జీని కొరియర్ ద్వారా అందుకున్నాడు.