మామిళ్లగూడెం, ఆగస్టు 29: పోలీసు అధికారుల సమష్టి కృషితో రాష్ట్రంలో శిక్షల శాతం గణనీయంగా పెరిగిందని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి అన్నారు. నేర సమీక్షపై పోలీసు ఉన్నతాధికారులు, సీపీలు, ఎస్పీలతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. నేరస్తులు తప్పించుకోకుండా ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షించడంతో శిక్షల శాతం పెరిగిందని అన్నారు. అయినా ఇందులో మరింత పురోగతి సాధించాలని సూచించారు. పోలీసు సిబ్బంది వృత్తిపరమైన పని సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ విధానంలో కేసుల దర్యాప్తులో మెరుగైన ఫలితాలు రావడంతోపాటు నేరస్తులకు సకాలంలో శిక్షలు పడుతున్నాయన్నారు.
పోలీసు స్టేషన్ల వారీగా పోలీసుల పనితీరుని తెలిపే సత్వర స్పందన నేరాల నిరోధం, నేర పరిశోధన ఛేదింపు, త్వరితగతిన కేసుల దర్యాప్తు పూర్తి చేసి సకాలంలో కోర్టుకు సమర్పించడం, సమన్ల జారీ, వారెంట్లను అమలు చేయడం, కోర్టులో పని చేయడం తదితరల అంశాల వారీగా ఫంక్షనల్ వర్టికల్స్ అమలు చేస్తున్నామని అన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్ అమలులో భాగంగా ఆగస్టులో 775 మంది పోలీసులకు ఉత్తమ అవార్డులు అందజేశామని చెప్పారు. హ్యూమన్ రిసోర్సు మేనేజ్మెంట్ సిస్టం ఎంట్రీ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఉత్తర్వులు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, సెలవులు, పనిష్మెంట్లు, జీతభత్యాలు, బదిలీలు, పోస్టింగ్లు, రిపోర్టింగ్లు, శిక్షణలు, పతకాలు, రివార్డులు, అవార్డులు, జీఎస్ఈ సంబంధిత పూర్తి సమాచార వివరాలు ఆన్లైన్లో అప్డేట్గా ఉండాలని సూచించారు. ఈ వీసీలో ఖమ్మం నుంచి సీపీ విష్ణు ఎస్ వారియర్, అడిషనల్ డీసీపీ శబరీశ్ పాల్గొన్నారు.