భద్రాచలం, ఆగస్టు 29 : భద్రాచలం పట్టణంలో మరోమారు భారీగా గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.కోటీ 18లక్షలు ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. ఆదివారం రాత్రి గోదావరి బ్రిడ్జి పాయింట్ వద్ద ఉన్న అటవీశాఖ చెక్‌పోస్ట్ దగ్గర పట్టణ ఎస్సై మధుప్రసాద్ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన రెండు కార్లను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది.
ఓ కారులోని ఇరువురు వ్యక్తులు పారిపోగా.. మరో కారులోని బూర్గంపాడు మండలం తాళ్లగొమ్మూరుకు చెందిన అన్వేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన వారిలో ఒకరు గడిగట్ల కుమార్, మరొకరు పల్లంటి ప్రవీణ్‌గా విచారణలో తేలింది. ఈ ముగ్గురు గంజాయిని ఆంధ్రప్రదేశ్‌లోని మోతుగూడెం సమీపంలో ఉన్న సుకుమామిడిలో రాము, మహేందర్ వద్ద కొనుగోలు చేసి భద్రాచలం మీదుగా చెన్నైలో జయకుమార్ అనే వ్యక్తికి అప్పగించేందుకు తరలిస్తున్నట్లు ఏఎస్పీ వివరించారు. రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని, పారిపోయిన నిందితులను త్వరలోనే పట్టుకొని కోర్టుకు అప్పగిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ సీఐ నాగరాజ్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.