ఖమ్మం, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితబంధు పథకం ఎస్సీ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నది. ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన చింతకాని మండలానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.450 కోట్లు కేటాయించింది. మండలవ్యాప్తంగా 3,447 మంది లబ్ధిదారులు పథకానికి ఎంపిక కాగా ఇప్పటివరకు 1,435 మందికి రూ.102.77 కోట్ల విలువైన యూనిట్లు అందాయి. చింతకాని మండల కాకుండా ఖమ్మం జిల్లావ్యాప్తంగా (ఐదు నియోజకవర్గాలు) 483 మంది ఎంపిక కాగా ఇప్పటికే 423 మంది లభ్ధిదారులకు రూ.4.23 కోట్లతో యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయింది. మరో 31 మందికి రెండు రోజుల్లో యూనిట్ల గ్రౌండింగ్ పూర్తికానున్నది. మిగిలిన 2,012 మందికి త్వరలో యూనిట్లు అందనున్నాయి. ప్రక్రియ మొత్తం పూర్తయితే జిల్లావ్యాప్తంగా పథకం లబ్ధిపొందిన వారు 3,930 మంది అవుతారు. ప్రభుత్వం అందించిన చేయూత ఎస్సీ కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నది. యూనిట్లు పొందిన లబ్ధిదారులు ఇప్పటికే వాటి ద్వార ఆదాయాన్ని పొందుతున్నారు. వారు ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్నారు. మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు. యూనిట్లు అందజేసినందుకు గాను సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.
కుటుంబమంతా సంతోషంగా ఉన్నాం
మాకు రెండెకరాల పొలం ఉన్నది. నాకున్న ఇద్దరు కొడుకులతో వ్యవసాయం చేసుకుంటూ మిగతా సమయంలో కూలీ పనులకు వెళ్లేవాళ్లం. దళితబంధు ద్వారా మా మూడు కుటుంబాలకు దళితబంధు పథకం వరంలా ఆదుకున్నది. మా కుటుంబానికి డ్రోన్ వ్యవసాయ యూనిట్ మంజూ రైంది. ప్రస్తుతం డ్రోన్‌కు మంచి గిరాకీ ఉంది. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాము. మా గ్రామంలోనే కాక చుట్టుపక్కన గ్రామాల్లోనూ స్ప్రే చేయడానికి వెళ్తున్నాం. రోజుకు రూ 5.వేల వరకు సంపాదిస్తున్నాం.
– కన్నెపోగు పెద్దపుల్లయ్య, ప్రొద్దుటూరు,
చింతకాని మండలం, ఖమ్మం జిల్లా
మరే ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదు..
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు వంటి పథకం దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమలు కావడం లేదు. భారత్ స్వతంత్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న నేపథ్యంలో ఎస్సీలకు పథకం గొప్ప కానుక. గడిచిన 75 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ ఎస్సీల ఆర్థికాభివృద్ధి కోసం పథకాలు అమలు చేయలేదు. సీఎం కేసీఆర్ మాత్రమే ఎస్సీల బాగోగుల గురించి ఆలోచిస్తున్నారు. పథకం అమలుతో కూలీలు సైతం యజమానులయ్యారు.
– లింగాల కమల్‌రాజు, జిల్లా పరిషత్ చైర్మన్, ఖమ్మం
సరికొత్త ఒరవడి..
రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేసి దేశంలో సరికొత్త ఒరవడికి నాంది పలికింది. ఒక్కో ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షల విలువైన యూనిట్లు అందజేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. పథకాన్ని ముందు చూపుతో అమలు చేస్తున్నది. ఒకనాడు కూలీలుగా పనిచేసిన వారు ఇప్పుడు యజమానులుగా మారారు. మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. స్వశక్తితో ఎదుగుతున్నారు.
– బొమ్మెర రామ్మూర్తి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు
ట్రాక్టర్ మంజూరైంది..
మాకు సెంట్ భూమి కూడా లేదు. నేను నా భార్య కూలి పనులకు వెళ్తాం. వ్యవసాయ పనులు, తాపీ పనులు.. ఇలా ఏ పని దొరికితే పనికి వెళ్లి పిల్లలను పోషించుకునేవాళ్లం. పోషణ భారంగా ఉండేది దళితబంధు పథకంలో భాగంగా నాకు ట్రాక్టర్ మంజూరైంది. ప్రస్తుతం మా గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో కిరాయికి తిప్పుతున్నా. ట్రాక్టర్‌కు సంబంధించిన మరికొన్ని పనిముట్లు అందాల్సి ఉంది. ట్రాక్టర్‌కు యజమాని అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు.
– బండ్ల శిల్వరాజు, లబ్ధిదారుడు, రాజారాంపేట, నేలకొండపల్లి మండలం
డెయిరీఫాం ఏర్పాటు చేశాం..
మాకు అర ఎకరా మాత్రమే భూమి ఉంది. భార్యాభర్తలిద్దరం కూలి పనులకు వెళ్తేనే పూట గడుస్తుంది. ఒకటి రెండు గేదెలతో పాల వ్యాపారం చేసేవాళ్లం. అయినా కుటుంబ పోషణ భారంగా ఉండేది. ఇటీవల దళితబంధు పథకంలో భాగంగా మేము డెయిరీఫాం ఏర్పాటు చేశాం. ఆర్థికంగా ఎదుగుతున్నాం. దళితబంధు పథకం నిరుపేద ఎస్సీ కుటుంబాలను ఆదుకుంటున్నది.
– బండ్ల వెంకట నారాయణ, లబ్ధిదారుడు, రాజారాంపేట, నేలకొండపల్లి మండలం
మంచి ఆదాయం వస్తున్నది..
కొంతకాలం క్రితం నా భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. నేను గతంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్‌గా పనిచేసే దానిని. నాకు కేవలం రూ.2 వేల గౌరవ వేతనం పొందేవాడిని. కొంత ఆదాయంతోనే నేను కుమార్తె ఆలనా పాలనా చూసుకునే వాడిని. వితంతువులకు దళితబంధు వర్తించదని కొందరు భయపెట్టారు. కానీ అది నిజం కాదని నాకు పథకం వర్తించిన తర్వాత నమ్మలేకపోయాను. నేను ముగ్గురితో కలిసి ఐజాక్ మిషన్ (సిమెంట్ కాంక్రీట్ సిద్ధం చేసి రవాణా చేసే యంత్రం) యూనిట్ తీసుకున్నాను. సీసీ రోడ్లు, ైప్లె ఓవర్ నిర్మాణానికి కాంట్రాక్టర్ల నుంచి మంచి డిమాండ్ ఉంది. రోజుకు కనీసం రూ.5 వేల ఆదాయం వస్తున్నది. కూలీ నుంచి ఇప్పుడు వాహనానికి యజమాని అయినందుకు ఆనందంగా ఉంది.
– అద్దంకి డిపోర, లబ్ధిదారుడు, నాగిలిగొండ, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా
గుమస్తాగా పనిచేశా..
నేను దశాబ్దాల పాటు గుమస్తాగా పని చేశా. ఇతర రాష్ర్టాల్లో కాంట్రాక్టర్ల కింద పనిచేశా. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. పథకంలో భాగంగా నేను వస్త్రదుకాణాన్ని ప్రారంభించాను. ఇప్పుడు దర్జాగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.
– మామిడిపల్లి వెంకటేశ్వరావు, లబ్ధిదారుడు, పేరాయిగూడెం, అశ్వారావుపేట టౌన్
డ్రైవర్ నుంచి యజమానినయ్యా..
నేను ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. నాకున్న కాస్త భూమిని సాగు చేసుకునే వాడిని. ఎస్సీ కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు అమలు చేస్తున్నారని తెలుసుకున్నా. పథకానికి మా కుటుంబం ఎంపికైంది. మాకు ట్రాక్టర్ యూనిట్ మంజూరైంది. ఒకప్పుడు డ్రైవర్నైనా నేను ఇప్పుడు ట్రాక్టర్‌కు యజమానినయ్యా. నా పొలంతో పాటు ఇతర రైతుల పొలాల్లోనూ ట్రాక్టర్ దున్నుతున్నా. కిరాయిలు గిట్టుబాటు అవుతున్నాయి. ఆర్థికంగా మా కుటుంబం ఎదుగుతున్నది. పథకం మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– కడారి సోమయ్య, లబ్ధిదారుడు, కిష్టాపురం, సత్తుపల్లి మండలం
గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు…
ఎస్సీల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. మా సంక్షేమాన్ని పట్టించుకున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. దళితబంధు పథకం ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా సీఎం కేసీఆర్ ఎస్సీల బాగోగుల గురించి ఆలోచిస్తున్నారు. ఉమ్మడి పాలనలో మాకు అన్యాయం జరిగింది. నాటి ప్రభుత్వాలు మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకు లాగానే భావించారు.
– కొప్పుల ఆంజనేయులు,దళిత నాయకుడు, ఖమ్మం రూరల్ మండలం
డీజే యూనిట్ మంజూరైంది..
మా కుటుంబానికి దళితబంధు పథకం వర్తించడంతో జీవితం భరోసా కలిగింది. గతంలో నేను చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ఏ రోజు వచ్చిన కూలి ఆ రోజుకు సరిపోయేది. అలా పేదరికంలో మగ్గిపోతున్న మా కుటుంబాన్ని దళితబంధు పథకం ఆదుకున్నది. పథకం భాగంగా మా కుటుంబానికి డీజే సిస్టమ్ మంజూరైంది. ఇప్పటికే కొన్ని శుభకార్యాలకు డీజీ సిస్టమ్ పెట్టాను. మున్ముందు వినాయక చవితి, దేవీ నవ రాత్రోత్సవాలు ఉన్న నేపథ్యంలో ఆర్డర్లు బాగానే వస్తున్నాయి. ఆదాయం బాగానే ఉంటున్నది.
– నర్రా వెంకన్న, లబ్ధిదారుడు, తనగంపాడు, ఖమ్మం రూరల్ మండలం
పెయింట్ మిక్సింగ్ సెంటర్ నడుపుతున్నా..
దళితుల ఆరాధ్యదైవం ముఖ్యమంత్రి కేసీఆర్. దళితబంధు ప్రవేశపెట్టి ఆర్థికంగా మమ్మల్ని ఆదుకుంటున్నారు. పథకంలో భాగంగా నాకు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. నేను జూ లూరుపాడులో పేయింట్ మిక్సింగ్ సెంటర్ ఏర్పాటు చేశాను. పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారమైన సమయంలో నాకు పథకం మంజూరైంది. ఇప్పుడు నేను మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాను. మరో వ్యక్తికి ఉపాధి కల్పిస్తున్నాను.
– మోదుగు రామకృష్ణ, లబ్ధిదారుడు, జూలూరుపాడు
వస్త్ర దుకాణం నడుపుతున్నా..
గతంలో నేను ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేసే వాడిని. నెలకు రూ.10వేల నుంచి రూ.15 వేల వరకు ఆదాయం వచ్చేది. ఎప్పుడైనా సెలవులు పెడితే జీతంలో కోత పడేది. కుటుంబ పోషణ భారంగా ఉండేది. దళితబంధు పథకంలో భాగంగా నేను శాంతినగర్‌లో వస్త్ర దుకాణం తెరిచాను. రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 సంపాదిస్తున్నాను. ఎస్సీల ఆర్థికాభివృద్ధికి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– మోటపోతుల సురేశ్, లబ్ధిదారుడు, వైరా
నేడు ట్రాక్టర్ యజమానిని..
గతంలో నేను ఎరువులు, పురుగుమందుల దుకాణాల వద్ద హమాలీ కూలీగా పనిచేసే వాడిని. రోజంతా పనిచేసినా పూట గడిచేది కాదు. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టతరంగా ఉండేది. దళితబంధు పథకంలో భాగంగా మా కుటుంబానికి ట్రాక్టర్ మంజూరైంది. ఒకప్పుడు కూలీనైనా నేను ఇప్పుడు ట్రాక్టర్ యజమాని అయినందుకు ఆనందంగా ఉంది. పొలాలు దున్నుతూ మంచి ఆదాయం పొందుతున్నా.
– యలమందల నరసింహారావు, లబ్ధిదారుడు, ఎస్సీ కాలనీ, చండ్రుగొండ
పథకం జీవితాన్నిచ్చింది..
రాష్ట్ర ప్రభుత్వం పథకం ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దళితబంధు పథకంలో భాగంగా మా కుటుంబానికి టెంట్‌హౌస్ యూనిట్ మంజూరైంది. టెంట్‌హౌస్ నడిపించుకుంటూ నేను మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నా. యూనిట్ మంజూరైన తర్వాత ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. గతంలో ఇల్లు గడవడానికి కష్టంగా ఉండేది. ఎస్సీలను ఆదరించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే.
– దాసరి కాంతారావు, లబ్ధిదారుడు, బూర్గంపహాడ్ మండలం
నాడు చిరువ్యాపారిని.. నేడు ట్రాలీ యజమానిని..
ఎస్సీల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ దళితబంధు అమలు చేస్తున్నారు. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. నేను గతంలో ఉల్లిపాయల వ్యాపారం చేసే వాడిని. ఊరూరా తిరుగుతూ రోజుకు రూ.250 నుంచి రూ.300 సంపాదించేవాడిని. కుటుంబ పోషణ భారంగా ఉండేది. దళితబంధు పథకంలో భాగంగా నాకు ట్రాలీ మంజూరైంది. ఇప్పుడు నేను రోజుకు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు సంపాదిస్తున్నా. ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నా. ఇంత మంచి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
– గొల్లమందల కొండల్రావు, లబ్ధిదారుడు, రొంపిమళ్ల, మధిర
కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు..
గతంలో మాకు అప్పు కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేవాడిని. ఎక్కడా రూపాయి పుట్ట లేదు. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. దేవుడిలా సీఎం కేసీఆర్ దళితబంధు వర్తింపజేసి మమ్మల్ని ఆదుకున్నారు. దళితులకు దళితబంధు అందజేసిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. మా కుటుంబం మరో ముగ్గురితో కలిసి జేసీబీ మిషన్ యూనిట్ సాధిందాం. ఇప్పటివరకు రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. దీనిలో రూ.90 వేలు డీజిల్, డ్రైవర్ ఖర్చులు పోగా మిగిలిన రూ.1.10 లక్షల లాభం వచ్చింది.
– కోపూరి నవీన్, రైల్వేకాలనీ, చింతకాని మండలం
పథకం మా జీవితాలను మార్చింది..
స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే ఎస్సీల స్థితిగతులు మారుతున్నాయి. ఎస్సీల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారు. దళితబంధు పథకంలో భాగంగా మా కుటుంబానికి సౌండ్ సిస్టమ్ యూనిట్ మంజూరైంది. యూనిట్‌ను సద్వినియోగం చేసుకుంటున్నాం. సౌండ్ సిస్టమ్ ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నా. పథకం మంజూరు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు..
– పొడుతూరి విక్రమ్, లబ్ధిదారుడు, మణుగూరు టౌన్
వ్యాపారంలో ముందుకెళ్తున్నా..
గతంలో అరకొర పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడిని. కుటుంబ పోషణ అంతంతమాత్రంగా ఉండేది. దళితబంధు పథకంలో భాగంగా నేను వస్త్ర దుకాణం తెరిచాను. వ్యాపారం బాగా సాగుతుండడంతో మా కుటుంబం చాలా హ్యాపీ. పథకం ఎస్సీల జీవితాలను మార్చుతున్నది. ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు వేయిస్తున్నది.