సీసీసీ నస్పూర్, ఆగస్టు 28 : రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ నాయకులు మత ఘర్షణలకు తెరలేపారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ.వెంకట్రావ్ అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై దాడులు అప్రజాస్వామికమని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదివారం నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అగ్ర నాయకుల కుట్రతోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై దాడి జరిగిందన్నారు. బీజేపీ తప్పుడు ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్, యూనియన్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనేక హక్కులు కల్పించినట్లు వివరించారు. కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న కవితకు సింగరేణి కార్మికులు ఎల్లవేళలా అండగా ఉంటారని స్పష్టం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వానికి ఎదురులేదని తెలిసిన బీజేపీ నాయకులు.. ఎలాగైనా ప్రభుత్వాన్ని అస్థిరపరిచి, వారి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి మత ఘర్షణలు, భౌతికదాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.
బీజేపీ నాయకుల ఆగడాలను టీబీజీకేఎస్ సింగరేణి కార్మికులం సాగనివ్వబోం.. ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ నెల 29న పెద్దపల్లిలో జరుగనున్న సీఎం కేసీఆర్ సభకు సింగరేణి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, నాయకులు సురేందర్‌రెడ్డి, డీకొండ అన్నయ్య, మంద మల్లారెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మెండె వెంకటి, అద్దు శ్రీను, తొంగల రమేశ్, అశోక్, మహిపాల్‌రెడ్డి, నీలం సదయ్య, కొలిపాక సమ్మయ్య, రావుల అనిల్ పాల్గొన్నారు.