మామిళ్లగూడెం, ఆగస్టు 28 : ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్స్ ఎంపికకు ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పరిశీలించారు. ఖమ్మం, సత్తుపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 105 పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలు చేశారు. ఖమ్మం పరిసర ప్రాంతంలో 31,415మంది అభ్యర్థులకు 29,177 మంది, సత్తుపల్లి ప్రాంతంలో 8,136 మంది అభ్యర్థులకు 6,777 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 39,551 మందికి 35,954 మంది హాజరైనట్లు సీపీ తెలిపారు. ఖమ్మం నగరంలోని శాంతినగర్ కాలేజీ, ఎస్బీఐటీ కాలేజీ, బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను సీపీ సందర్శించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
కొత్తగూడెం అర్బన్/ పాల్వంచ/ భద్రాచలం, ఆగస్టు 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలంలో 49పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. గంట ముందుగానే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లాలో 17,077 మంది అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు జారీ చేయగా 15,633 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 13,160 మంది కొత్తగూడెం రీజియన్లో, భద్రాచలంలో 2,473 మంది పరీక్ష రాసినట్లు ఎస్పీ వినీత్ తెలిపారు. పరీక్షా కేంద్రాలను ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు పరిశీలించారు. పాల్వంచలోని పరీక్షా కేంద్రాల వద్ద పాల్వంచ పట్టణ, రూరల్ ఎస్సైలు నరేశ్, ప్రవీణ్, శ్రీనివాస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలం పట్టణంలో మొత్తం 2,856 అభ్యర్థులకు 2,473మంది పరీక్ష రాసినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డీ భద్రయ్య తెలిపారు.