ఖమ్మం కల్చరల్, ఆగస్టు 28: సాంస్కృతిక జాబిల్లిగా ‘నెల నెలా వెన్నెల’ కళారంగ ప్రకాశాన్ని వెదజల్లుతోందని పలువురు వక్తలు ప్రశంసించారు. నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ (ఆర్క్స్) ఆధ్వర్యంలో ‘నెల నెలా..వెన్నెల’ సాంస్కృతిక వేడుక ఐదవ వార్షికోత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత మొగిలి శ్రీనివాసరెడ్డి, బుగ్గవీటి సరళ, కార్పొరేటర్ కమర్తపు మురళి హాజరై ‘నెల నెలా.వెన్నెల’ సాంస్కృతిక కృషిని ప్రశంసించారు. 60 నెలలుగా నిరాటంకంగా నాటక ప్రదర్శనలు చేయిస్తూ రంగస్థల వైభవాన్ని తీసుకొస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈసందర్భంగా కళా సేవలందిస్తున్న జిల్లా మహిళా ప్రాంగణః అధికారి వేల్పుల విజేతను నిర్వాహకులు సత్కరించారు. సభకు ఆర్క్స్ అధ్యక్షుడు మోటమర్రి జగన్మోహన్రావు అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, ఖమ్మం కళాపరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు వీవీ అప్పారావు, డాక్టర్ నాగబత్తిని రవి, కుతుంబాక కృష్ణప్రసాద్, ప్రజా నాట్యమండలి బాధ్యులు వేముల సదానందం, నామా లక్ష్మీనారాయణ, దేవేంద్ర పాల్గొన్నారు. కరీంనగర్‌కు చెందిన కళాకారులు ప్రదర్శించిన ‘దొంగలు’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. కుటుంబ విలువలను చాటిన ఈ నాటికలోని పలు సన్నివేశాలు కంటతడి పెట్టించాయి.
డైరెక్టర్ మొగిలి గుణకర్కు సత్కారం..
ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ యాంకర్, నటుడు, దర్శకుడు మొగిలి గుణకర్ను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం సత్కరించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సినీ వారం’ కార్యక్రమంలో గుణకర్ దర్శకత్వం చేసిన ‘శుభ సంకల్పం’ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఉమ్మడి కుటుంబాలను కాపాడుకోవాలని, తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేయరాదని, కుటుంబ బంధాలు, విలువల నేపథ్యంలో గల చిత్రాన్ని తిలకించి పలువురు ప్రశంసించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన గుణకర్ను భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ శాలువా, మెమెంటోతో సత్కరించి అభినందించారు. ఇటువంటి సందేశాత్మక చిత్రాల వల్ల సమాజంలో విలువలు పెరుగుతాయని, చిన్న చిత్రమైనా పెద్ద సందేశాన్నిచ్చిందని ప్రశంసించారు. ఈ చిత్రంలో నటించిన నంది అవార్డు గ్రహీత జామా, అన్నపూర్ణ, స్వప్న, శివజ్యోత్స్న, ఆర్కే దుగ్గిరాలను అభినందించారు. లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, బొమ్మ రాజేశ్వరరావు, ముత్తమాల ప్రసాద్, డాక్టర్ కరీం, బండి వీరభద్రరావు, గరిక సంపత్ కుమార్ గుణకర్ను అభినందించారు.
‘తీరొక్కపూలు’ పుస్తకావిష్కరణ..
ప్రముఖ రచయిత్రి, ఉపాధ్యాయురాలు వురిమళ్ల సునంద సంపాదకీయంలో వెలువడిన ‘ తీరొక్కపూలు’ పుస్తకాన్ని నగరంలోని రిక్కాబ్బజార్ పాఠశాలలోఅక్షరాల తోవ సాహితీ సంస్థ, వురిమళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్షరాల తోవ నిర్వాహకుడు నామా పురుషోత్తం మాట్లాడుతూ చిట్టి కథలు బాలల మెదళ్లను ఎంతో ఆలోచింపజేస్తాయని, బాల సాహిత్యం పెంపునకు ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. రచయిత్రి సునంద సరళమైన భాషలో బాలలను ఆకట్టుకునే విధంగా అనేక కథలు రాయడం ఎంతో అభినందనీయమన్నారు. కథల పోటీల్లో విజేతలైన విద్యార్థులతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేయడం విశేషమన్నారు. కవి రాచమళ్ల ఉపేందర్ పుస్తకాన్ని పరిచయం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం కనపర్తి వెంకటేశ్వర్లు, ప్రముఖ కవి రౌతు రవి, పొత్తూరి సీతారామారావు, పోతగాని సత్యనారాయణ, సయ్యద్ షఫీ, కొమ్మవరపు కృష్ణయ్య, వేము రాములు, బ్రహ్మం, శైలజ, అమ్మ ఒడి బాబు, సత్యనారాయణ, శ్రీనివాస్, మాధవి, రమేశ్ పాల్గొన్నారు.