కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 27:గతంలో సదరం ధ్రువీకరణ పత్రం పొందాలంటే అనేక ఇబ్బందులు పడేవారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోయేవారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం సదరం శిబిరాల నిర్వహణను సులభతరం చేసింది. సదరం సర్టిఫికెట్ కోసం ఎవరినీ ఆశ్రయించాల్సిన పనిలేదు. ఆన్లైన్లో నమోదు చేసుకుంటే చాలు. దివ్యాంగులు, వారికి ఏ రోజు ఎక్కడ క్యాంపునకు హాజరుకావాలో తెలిసిపోతుంది. అంతేకాదు, జిల్లాగ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నెలనెలా కేటగిరీల వారీగా సదరం క్యాంపులు నిర్వహిస్తున్నది. కేవలం నెల రోజుల్లోనే అర్హులకు సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటివరకు 62 క్యాంపులు నిర్వహించగా.. మొత్తం 9,780 మంది హాజరయ్యారు. వైద్యులు 7,268 మందిని అర్హులుగా గుర్తించి వారికి సదరం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
దివ్యాంగులు నెలనెలా ‘ఆసరా’ పింఛను పొందాలన్నా, విద్య, ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు పొందాలన్నా సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. ఉమ్మడి పాలనలో దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. క్యాంపులకు వందలాది మంది హాజరవుతుండడంతో వారికి వసతుల కల్పించేందుకు అధికారులు అవస్థలు పడేవారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సర్కార్ క్యాంపుల నిర్వహణ ప్రక్రియను సులభతరం చేసింది. జిల్లాగ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నెల నెలా కేటగిరీల వారీగా సదరం క్యాంపులు నిర్వహిస్తున్నది. కేవలం నెలరోజుల్లోనే అర్హులకు సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నది.
62 క్యాంపుల నిర్వహణ..
జిల్లా ఏర్పాటైన నాటి నుంచి అధికారులు ఇప్పటివరకు 62 సదరం క్యాంపులను నిర్వహించారు. గతంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాంపులు జరిగేవి. ఈ క్యాంపులకు ఒకేసారి వేల సంఖ్యలో దివ్యాంగులు హాజరవుతూ ఉండేవారు. కేంద్రాల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు పాడేవారు. 2019 తర్వాత కేటగిరీల వారీగా కా్ంయపుల నిర్వహణ ప్రారంభమైంది. శారీరక వైకల్యం, బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, మానసిక రుగ్మతతో బాధపడుతున్న వారికి వేర్వేరుగా క్యాంపులు జరుగుతున్నాయి. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న తేదీల్లో అధికారులు క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 62 క్యాంపులకు మొత్తం 9,780 మంది హాజరుకాగా వైద్యులు 7,268 మందిని అర్హులుగా గుర్తించి వారికి సర్టిఫికెట్లు అందించారు.
ఆన్లైన్లో నమోదు తప్పనిసరి..
సదరం క్యాంపులకు హాజరయ్యేవారు ఆసుపత్రులు, డీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సదరం సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకుంటే చాలు. గతంలో క్యాంపునకు హాజరై అనర్హులైనవారు మళ్లీ మళ్లీ క్యాంపులకు వస్తున్నారు. దీంతో క్యాంపు నిర్వహణ కష్టతరమవుతున్నదని అధికారులు వెల్లడిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నెలనెలా సదరం క్యాంపులు నిర్వహించే తేదీలను ప్రకటిస్తున్నామని, మీ సేవా సెంటర్లలో స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులు, వారికి కేటాయించిన రోజు క్యాంపునకు హాజరు కావాలని సూచిస్తున్నారు. క్యాంపునకు హాజరయ్యే దివ్యాంగుల సంఖ్య ఆధారంగా డీఆర్డీఏ సిబ్బంది వసతులు కల్పిస్తున్నారు.
మండలాల వారీగా దివ్యాంగులు..
జిల్లావ్యాప్తంగా దివ్యాంగులకు ప్రతి నెలా రూ.3,016 పింఛను అందుతున్నది. ఆళ్లపల్లి మండలంలో 99 మంది, అన్నపురెడ్డిపల్లి 152 మంది, అశ్వాపురం 376 మంది, అశ్వారావుపేట 318 మంది, భద్రాచలం 319 మంది, బూర్గంపాడు 424 మంది, చండ్రుగొండ 283 మంది, చర్ల 296 మంది, చుంచుపల్లి 276 మంది, దమ్మపేట 445 మంది, దుమ్ముగూడెం 301 మంది, గుండాల 89 మంది, జూలూరుపాడు 262 మంది, కరకగూడెం 86 మంది, కొత్తగూడెం(మున్సిపాలిటీ) 481 మంది, లక్ష్మీదేవిపల్లి 300 మంది, మణుగూరు (మున్సిపాలిటీ) 157 మంది, మణుగూరు (రూరల్) 227 మంది, ములకలపల్లి 199 మంది, పాల్వంచ(రూరల్) 322 మంది, పాల్వంచ (మున్సిపాలిటీ) 357 మంది, పినపాక 185 మంది, సుజాతనగర్ 239 మంది, టేకులపల్లి 368 మంది, ఇల్లెందు (రూరల్) 455 మంది, ఇల్లెందు (మున్సిపాలిటీ)లో 252 మంది సదరం సర్టిఫికెట్ పొంది పింఛను తీసుకుంటున్నారు.
పెండింగ్లో సర్టిఫికెట్లు లేవు..
సదరం క్యాంపులు నిర్వహించి నెల రోజుల్లోనే సర్టిఫికెట్లు అందజేస్తున్నాం. పెండింగ్లో ఒక్క సర్టిఫికెటైనా లేదు. జిల్లా ఆస్పత్రిలో ప్రతి నెలా కేటగిరీల వారీగా క్యాంపులు నిర్వహిస్తున్నాం. క్యాంపులకు హాజరైన వారు సర్టిఫికెట్ల కోసం సరాసరి డీఆర్డీఏ కార్యాలయానికి వస్తున్నారు. దివ్యాంగులు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. అర్హులైతే వారికి అధికారులు కాల్ చేసి సర్టిఫికెట్ అందజేస్తారు.
– మధుసూదనరాజు, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి