ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 27: పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించే మట్టి ప్రతిమలే ప్రతిష్ఠించి పూజించే విధంగా స్తంభాద్రి ఉత్సవ కమిటీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఖమ్మంలో ఐదు వేల మట్టి విగ్రహాలను సిద్ధం చేసింది. ఈ నెల 31 నుంచి జిల్లాలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకునేందుకు సబ్బండ వర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్లాస్టిక్, రసాయన వినియోగాన్ని తగ్గంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్ల్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మట్టి గణపతులను పూజించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించినట్లవుతుంది.
గట్టి సంకల్పం..
పర్యావరణ హితం కోసం గట్టి సంకల్పం చేపట్టింది స్తంభాద్రి ఉత్సవ కమిటీ. ఈ మేరకు ఈ కమిటీ ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు డౌలే సాయికిరణ్ ఇప్పటికే నగరంలోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో మట్టి విగ్రహాల స్టాల్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కోల్‌కతాకు చెందిన విగ్రహాల తయారీదారులతో తయారు చేయించిన ఈ మట్టి విగ్రహాల స్టాల్‌ను కొద్ది రోజుల క్రితం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించిన విషయం విదితమే. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాలను అందుబాటులోకి తెచ్చినట్లు సాయికిరణ్ చెబుతున్నారు.
ఐదు వేల విగ్రహలు..
వీటితోపాటు సాయికిరణ్ స్వయంగా తయారు చేయించిన మరో ఐదు వేల మట్టి విగ్రహాలను ఆదివారం నుంచి ఉచితంగా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలోని ప్రధాన సెంటర్లలో మూడు కౌంటర్లు ఏర్పాటు చేసి నగరవాసులకు వాటిని అందించేందుకు కార్యాచరణ చేపట్టారు. ఇదిలా ఉండగా నగరంలో 27 ఏళ్లుగా గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్న శివాలయం గణేశ్ ఉత్సహ కమిటీ తయారు చేయించిన 26 అడుగుల మట్టి గణపతి విగ్రహం నగరంలో ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. మూడు నెలలపాటు 24 మంది కళాకారులు తయారు చేసిన ఈ లాల్ గణపతి విగ్రహం ఇప్పటికే నగరానికి చేరుకుంది.