మామిళ్లగూడెం, ఆగస్టు 27: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. వినాయక చవితి ఉత్సవాలు, కానిస్టేబుల్స్ ఉద్యోగాల రాత పరీక్షల నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 31 నుంచి గణేశ్ నవరాత్రి ఉత్సవాల ప్రారంభం కానున్న సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. భక్తులకు ఆటంకం కలుగకుండా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ముందుకెళ్లాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. గణేశ్ నిమజ్జనాలకు ఆటంకాలు కలుగకుండా సరిపడినన్ని క్రేన్లను ఏర్పాటు చేయాలన్నారు.
విగ్రహాల ఏర్పాటుకు ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. నిమజ్జన సమయం, నిమజ్జన ఊరేగింపు, శోభాయాత్ర మార్గాలపై ఎస్‌హెచ్‌వోలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గణేష్ విగ్రహాల వద్ద స్టాటిక్ బందోబస్తు ఉంచడంతోపాటు సున్నితమైన ప్రదేశాల్లో పికెట్లు ఏర్పాటు చేయాలని, నిరంతరం పెట్రోలింగ్ చేయాలని సూచించారు. మండపాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనుమానిత ట్రబుల్ మోంగర్స్, ఈవ్‌టీజర్లపై నిఘా పెట్టాలని సూచించారు. ప్రతీ మండపంలో 24 గంటలూ ఒక వలంటీరు ఉం డేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు.
కానిస్టేబుల్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు..
ఆదివారం నాటి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ ఆదేశించారు. ట్రాఫిక్ అంతరా యం లేకుండా, పారింగ్ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కేం ద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.