మధిర టౌన్, ఆగస్టు 27: ఆసరా పింఛన్లతో పేదల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్ సౌకర్యం కల్పించడంతో వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మధిర మార్కెట్ యార్డులో మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత అధ్యక్షతన శనివారం నిర్వహించిన నూతన పింఛన్ కార్డుల పంపిణీలో ఆయన మాట్లాడారు. పింఛన్ అందుకుంటున్న ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దీవించాలని కోరారు. మధిర మండలానికి సుమారు 10 వేల మందికి పింఛన్లు అందుతున్నాయని, ఇప్పుడు కొత్తగా మండలానికి 1,524 మందికి, మున్సిపాలిటీకి 344 మందికి పింఛన్లు అందనున్నాయని అన్నారు. అర్హత ఉండి ఇంకా పింఛన్ మంజూరుకాని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో పరుగులు తీస్తోందని అన్నారు. మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో బీజేపీ నేతలు మత ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎంపీపీ మెండెం లలిత, మధిర మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.