స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో కొత్త నియామకాలు చేపట్టేందుకు కసరత్తు మొదలైంది. భద్రాద్రి జోనల్ పరిధిలో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే రాత పరీక్ష పెట్టి అర్హులను ఎంపిక చేశారు. పది సంవత్సరాలు అంగన్వాడీ టీచర్‌గా పనిచేసి పదో తరగతి పాసైన వారికి అర్హత కల్పించగా 48మంది మెరిట్ మార్కులు సాధించారు. జోన్ పరిధిలో ఎంతమందికి పోస్టులు దక్కుతాయోనని టీచర్లు ఎదురుచూస్తున్నారు. ఈ నెల చివరి వరకు గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ శాఖ డైరెక్టర్ ఇటీవల డీడబ్ల్యూవోల జూమ్ మీటింగ్‌లో వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీతో ఖాళీ కానున్న టీచర్ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 64 అంగన్వాడీ టీచర్, 149 ఆయా, 65 మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో 102 మంది టీచర్ల భర్తీకి 2021లో నోటిఫికేషన్ విడుదల చేసినా.. కోర్టులో కేసు ఉండడంతో వాటిని భర్తీ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నది.
కొత్త టీచర్ పోస్టుల భర్తీ అలాఉండగా ఇప్పటివరకు మినీ అంగన్వాడీలుగా ఉన్న సెంటర్లను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందుకోసం మినీ అంగన్వాడీ కేంద్రాల సంఖ్యను గుర్తించింది. 300 జనాభా కంటే ఎక్కువగా ఉన్న కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలను తీసుకున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 626 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 300జనాభా పైగా ఉన్న కేంద్రాలు 427గా ఆ శాఖ గుర్తించింది. వీటిని మెయిన్కేంద్రాలుగా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో ఎక్కువ స్థాయిలో ఆయా పోస్టులు ఖాళీ కానున్నాయి.
నాడు అద్దె భవనాలు, పురాతన భవనాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయనున్నది. ఇప్పటికే ప్రతి అంగన్వాడీ కేంద్రానికి మెరుగులు దిద్ది రంగులు వేసి సౌకర్యాలు కల్పించారు. గ్రామ పంచాయతీ ద్వారా పారిశుధ్యం నిర్వహణ చేసేందుకు కసరత్తు చేయడంతో అంగన్వాడీ కేంద్రాలు సరికొత్త రూపును సంతరించుకున్నాయి. ఇదే కాకుండా పంచాయతీ ఆధ్వర్యంలో కరెంటు మీటర్ పెట్టి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, కుర్చీలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాప్రతినిధుల సహకారం కోరుతూ వారి సమక్షంలోనే కార్యక్రమాలను చేపడుతున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలు సౌకర్యాలతో తళుక్కున మెరుస్తున్నాయి. మిషన్ భగీరథ వాటర్‌ను కూడా అందుబాటులో ఉంచారు.
గ్రేడ్-2 సూపర్వైజర్ల భర్తీ కోసం పరీక్ష నిర్వహించాం. అర్హులను గుర్తించి వారి సర్టిఫికెట్లను కూడా పరిశీలించాం. హైదరాబాద్ డైరెక్టర్ ఆదేశాలతో త్వరలో ఉత్తర్వులు వస్తాయి. ఈ నెల చివరికల్లా వారు కొత్త సూపర్వైజర్లు విధుల్లో చేరుతారు. టీచర్ పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నది. మినీ సెంటర్లను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలను పంపించాం.
– ఆర్.వరలక్ష్మి, డీడబ్ల్యూవో