ఖమ్మం, ఆగస్టు 24 (నమసే ్తతెలంగాణ ప్రతినిధి) : దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ తప్పుడు విధానాల వల్ల దేశ సమైక్యత, సమగ్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న బీజేపీకి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజల పోరాట పటిమ ముందు బీజేపీ ఆటలు సాగబోవని, కాషాయ చేష్టలను ఇక్కడి ప్రజలు తరిమి కొడతారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్పైగానీ, కేసీఆర్ కుటుంబంపైగానీ ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అప్పట్లో గుజరాత్లో అల్లర్లు సృష్టించిన కేసులో 90 రోజులు జైలు శిక్ష అనుభవించిన బీజేపీ నేత, ఇప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇప్పుడు మునుగోడుకు వచ్చి నీతి సూత్రాలు వల్లిస్తున్నారని అన్నారు.
అవన్నీ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉన్నాయని విమర్శించారు. ఉద్యమమే ఊపిరిగా, ప్రజా సంక్షేమమే ప్రాణంగా భావించే సీఎం కేసీఆర్‌ను బీజేపీ నేతలు రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారని అన్నారు. అందుకే ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తమను ప్రశ్నించే పార్టీల నేతలపై, తమ మాటకు తలొగ్గని ప్రజాప్రతినిధులపై ఈడీ, సీబీఐ లాంటి సంస్థలతో దాడులు చేయించడమే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తోందని అన్నారు. కేంద ప్రభుత్వ పెద్దలు.. ఈడీ, సీబీఐలను తమ తొత్తులుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన అమిత్‌షా.. దళితుడి ఇంటికి వెళ్లి కనీసం మంచినీళ్లు కూడా తాగలేదన్నారు.
హోటల్ నుంచి తీసుకొచ్చిన భోజనం చేసి దళితుడి పైన ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. రైతులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వని అమిత్‌షా.. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా రైతులు ఉద్యమాలు చేయాలని అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. రాజాసింగ్, శర్మలాంటి బీజేపీ నాయకులు దేశంలో అల్లర్లు సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారని, అవన్నీ అమిత్‌షా కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు.
బండి సంజయ్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా తిరుగుతూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ నాయకత్వంలో ‘వన్ నేషన్ – వన్ రూలింగ్ పార్టీ’ అనే నినాదం రావడం ప్రమాదకరమని అన్నారు. బీజేపీ కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని చాలాసార్లు రుజువైందని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు గుర్తుచేశారు. గుజరాతీలు గుజరాతీలకే దేశాన్ని అమ్మి పెడుతున్నారని దుయ్యబట్టారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ నేతలకు తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, టీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యది రాజకీయ హత్యేనని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. కృష్ణయ్య హత్య విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. హత్య జరిగిన వెంటనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. హత్య జరిగిన వెంటనే తాను, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితర నాయకులమంతా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి, తెల్దారుపల్లికి వెళ్లామని అన్నారు.
ఆ హత్యను పార్టీ తరఫున తీవ్రంగా ఖండించామని, దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరామని అన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతోపాటు ఇతర నాయకులమంతా కృష్ణయ్య కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు, ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని మరో ప్రశ్నకు బదులిచ్చారు. కృష్ణయ్య హత్య కోసం ఐదు నెలలుగా ప్లాన్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని అన్నారు.