ఖమ్మం, ఆగస్టు 24: ఖమ్మం నగరాభివృద్ధే లక్ష్యమని, మంత్రి అజయ్, కార్పొరేటర్ల సహకారంతో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడతామని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరం గ్రీన్ సిటీగా రూపుదిద్దుకుంటున్నదన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేయాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి నగరాన్ని అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్ల చిన్నచూపు ఉందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. నగరంలోని అన్ని డివిజన్లకు సమానంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. చెత్తసేకరణకు ట్రాక్టర్లు, ఆటోల కేటాయింపులోనూ వ్యత్యాసం లేదన్నారు. మేయర్ ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ మంజుల జోక్యం చేసుకొని తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారచు. ఎజెండా అంశాలపై చర్చ పూర్తికాగానే మాట్లాడే అవకాశం ఇస్తామని మేయర్ సమాధానమిచ్చారు.
అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనంతరం కార్పొరేషన్ రెవెన్యూ అధికారి శ్రీనివాస్ కౌన్సిల్ సభ్యులకు ఎజెండా చదివి వినిపించారు. ఉద్యోగుల వేతనాల చెల్లింపు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కొనసాగింపు, వారి వేతనాలు, నగరంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు, కొత్త పనులకు నిధుల కేటాయింపు, భవన నిర్మాణాలకు దరఖాస్తుల ఆమోదం, జిల్లా గ్రంథాలయానికి సెస్ రూ.1,07,79,701 చెల్లించాలని సభ దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం కౌన్సిల్ ఆయా అంశాలను ఆమోదించింది. అనంతరం కార్పొరేటర్లు వారి డివజన్న్లలో నెలకొన్న సమస్యలను సమావేశ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, ఈఈలు కృష్ణలాల్, రంజిత్‌కుమార్, డీఈలు, ఏఈలు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.