సత్తుపల్లి రూరల్, ఆగస్టు 25: పేదరికమే గీటురాయిగా పథకాలు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. లబ్ధిదారులను గుర్తించి నేరుగా వారి ఇంటికి వెళ్లి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణాయేనని స్పష్టం చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి విధానం లేదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అందిస్తూ మానవతా స్ఫూర్తిని చాటుతున్నారని అన్నారు.
మండలంలోని రామానగరం, గంగారం, బేతుపల్లి, తాళ్లమడ, పాకలగూడెం, కిష్టారం, కాకర్లపల్లి, బుగ్గపాడు గ్రామాల్లో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. నూతన పింఛను మంజూరు కార్డులు, సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులను ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 57 ఏళ్లు నిండిన వారందరికీ సీఎం కేసీఆర్ నూతన పింఛన్లు మంజూరు చేశారని అన్నారు. గతంలో సత్తుపల్లి నియోజకవర్గంలో 29 వేల మందికి ఆసరా పింఛన్లు వచ్చేవని, ఇప్పుడు మరో 11 వేల మందికి నూతన పింఛన్లు మంజూరు చేశారని అన్నారు. దీంతో నియోజకవర్గంలో మొత్తం 40 వేల మందికి పింఛన్లు అందుతున్నాయని అన్నారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు లేవని, గుజరాత్లో రూ.600 మాత్రమే పింఛను అందిస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధిని చూడలేకనే ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు, లబ్ధిదారులు అండగా నిలవాలని కోరారు. నియోజకవర్గంలో ఇంకా ఎవరైనా అర్హులుంటే పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వివిధ పంచాయతీల్లో 72 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.72 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆడబిడ్డకు చీరసారెలతో కలిపి చెక్కులు అందజేశారు. ఆయా గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కూడా రూ.15 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
గంగారానికి చెందిన దివ్యాంగుడు నడ్డి ముసలయ్యకు రూ.2 లక్షల విలువైన వినికిడి యంత్రాన్ని అందజేశారు. తొలుత ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు సూర్యనారాయణ, శ్రీనివాసరావు, వీరేశం, సురేశ్, జానిమియా, సురేశ్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, దొడ్డా హైమావతి, కూసంపూడి రామారావు, గాదె సత్యం పాల్గొన్నారు.