మారుతున్న కాలంతోపాటు కర్షకుల ఆలోచనా విధానంలోనూ మార్పు వస్తున్నది. పంటల సాగులో వినూత్న పద్ధతులు అవలంబిస్తూ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, లాభాలు వచ్చే పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాధారణం కంటే వాణిజ్య పంటల సాగు వైపు అడుగేస్తున్నారు. గతంలో ఖమ్మం జిల్లావ్యాప్తంగా పత్తి, వరి, మిర్చి అధికంగా సాగు చేసేవారు. ఈ ఏడాది రైతులు పత్తిని తగ్గించి మిర్చి సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలోని భూములు పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలకు అనుకూలంగా ఉండడం.. మార్కెట్లో మిర్చికి మంచి ధర పలుకుతుండడంతో మిర్చి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. గతేడాది జిల్లాలో 1,03,021 ఎకరాలు మిర్చి సాగు చేశారు. ఈ సారి 1.25 లక్షల ఎకరాలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారుల అంచనా. అంటే గతేడాది కంటే 25శాతం అధికం. మిర్చి నారుకు గతంలో ఏర్పాటు చేసిన నర్సరీల కంటే ఈ సారి ఎక్కువగా అందుబాటులోకి రావడం కర్షకులకు కలిసొచ్చే అంశం.
కూసుమంచి, ఆగస్టు 24: సాధారణ పంటల కంటే రైతులు వాణిజ్య పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఈసారి జిల్లావ్యాప్తంగా రైతులు పత్తి సాగును తగ్గించి మిర్చి సాగు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని భూములు పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలకు అనుకూలం. మార్కెట్లో మిర్చికి మంచి రేటు పలుకుతుండడంతో మిర్చి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. కొందరు స్వయంగా నారు పెంచుకుంటుండగా మరికొందరు నర్సరీల్లో పెంచిన మొక్కలను కొనుగోలు చేస్తున్నారు.
గతంలో నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బందులు పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఉమ్మడి పాలనలో విద్యు త్ సమస్యలు తీవ్రంగా ఉండేవి. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడో పోతుందో తెలియని పరిస్థితి. రైతులు రోజంతా కాపుగాసే పరిస్థితులు ఉండేవి. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మిషన్ కాకతీయతో చెరువులు బాగుపడ్డాయి. సాగునీటి వనరులు అందుబాటులోకి వచ్చాయి. నకిలీ విత్తనాల విక్రయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో రైతులకు ఇబ్బందులు తప్పాయి. వాణిజ్య పంటగా పేరున్న మిర్చి సాగుకు రైతులు గతంలో దేశవాళీ విత్తనాలు వినియోగించేవారు. కానీ 15 సంవత్సరాలుగా హైబ్రీడ్ విత్తనాలు వేస్తున్నారు. గతంలో సాధారణ పద్ధతిలో సాగు చేసేవారు. కానీ కొన్నేళ్ల నుంచి జిల్లావ్యాప్తంగా రైతులు మల్చింగ్, డ్రిప్ పద్ధతిలో మిర్చి సాగు చేస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. మల్చింగ్ విధానంలో కలుపు సమస్యలు ఉండకపోవడం, కూలి ఖర్చులు మిగులుతుండడంతో రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 2019లో 52,620 ఎకరాలు, 2020లో 55,990 ఎకరాలు, 2021లో 1,03,021 ఎకరాలు, ఈ ఏడాది 1.25 లక్షల ఎకరాలకు పైగా రైతులు మిర్చి సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది గతేడాది కంటే 25 శాతం అధికం. మిర్చి నారుకు గతంలో ఏర్పాటు చేసిన నర్సరీలకంటే ఈసారి ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. నర్సరీ యాజమాన్యాలు ఒక్కో మొక్కను రూ.80 పైసల నుంచి రూ.90 పైసల వరకు విక్రయిస్తున్నాయి. డిమాండ్ పెరిగితే మున్ముందు రూ.1 నుంచి రూ.2 వరకు పలికే అవకాశం ఉందని రైతులు వెల్లడిస్తున్నారు. కొం దరు రైతులు నాణ్యమైన మొ క్కల కోసం ఆంధాప్రాంతానికి వెళ్తున్నారు. రెండు, మూడు నర్సరీలను పరిశీలించి మొక్కలను ఎం చుకుంటున్నారు. ప్రస్తుతం జి ల్లాలో మిర్చి నారుకు ఇబ్బందులు లేవని, మున్ముందు ఎలా ఉంటుందో తె లియదని రైతులు అంటున్నారు.
గతంలో పత్తి సాగు చేశా. ఈసారి మిర్చికి డిమాండ్ ఉందని నమ్మి మిర్చి సాగు చేయాలనుకుంటున్నా. మల్చింగ్ పద్ధతిలో తోట వేస్తున్నా. మల్చింగ్‌తో కలుపు సమస్యలు ఉం డవు. సాగుకు డ్రిప్ వాడుతున్నా. ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు వస్తుంది. సాగునీటికి ఇబ్బంది లేదు. రైతుబంధు అందింది. పెట్టుబడికి ఇబ్బందులు లేవు. ఈసారి మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా.
– ఆడెపు లింగయ్య, కూసుమంచి, రైతు
నాకున్న ఎకరన్నరలో గతేడాది పత్తి సాగు చేశా. ఈసారి మిర్చి సాగు చేయాలనుకుంటున్నా. మిర్చి నారుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నేను జీళ్లచెరువులోని ఓ నర్సరీలో ఒక మొక్కకు రూ.90 పైసల చొప్పున చెల్లించి నారు కొన్నా. మిర్చి మంచి లాభాలనిస్తుందని ఆశిస్తున్నా. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి ఇబ్బందులు లేవు. భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నాయి. విద్యుత్ కోతలు లేవు. పొలాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నది. సీఎం కేసీఆర్ సీజన్‌కు ముందే రైతుబంధు అందిస్తున్నారు. ధీమాగా ఎవుసం చేసుకుంటున్నాం.
– భీమ్లానాయక్, రైతు, గుర్వాయిగూడెం తండా