కూసుమంచి రూరల్, ఆగస్టు 24: ఉన్నత చదువులు చదివిన ఇద్దరు యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సొంత ఊరిలోనే పాడి పరిశ్రమను స్థాపించారు. దీని ద్వారా తాము స్వయం ఉపాధి పొందడమే కాకుండా మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. వారే మునిగేపల్లికి చెందిన దండా నరేశ్, దండేల ఉపేందర్‌రావు. వీరద్దరూ సమీప బంధువులు. ఇద్దరూ కలిసి డెయిరీ స్థాపించాలని నిర్ణయించుకుని పలు ప్రాంతాలకు వెళ్లి డెయిరీలను పరిశీలించారు. డెయిరీ నిర్వహణపై అధ్యయనం చేశారు. మూడు ఎకరాల్లో డెయిరీ ఏర్పాటు చేసి ఒక్కో గేదెకు సుమారు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వెచ్చించి హర్యానా నుంచి 50 గేదెలను తీసుకొచ్చారు. మొదట్లో పడరాని పాట్లు పడ్డారు. ఏడాది తిరగకముందే మరికొన్ని పశువులను కొన్నారు. ప్రస్తుతం డెయిరీలో 50 గేదెలు, ఒక ఆవు, రెండు దున్నలు, 15 వరకు గేదె దూడలు ఉన్నాయి.
వీటికి ఏడాదికి సుమారు రూ.2.50 లక్షల వెచ్చించి దాణా, గడ్డితో పాటు పోషకాలు అందిస్తున్నారు. సిబ్బందికి నెలకు రూ.2 లక్షల వేతనాలు ఇస్తున్నారు. ఇక విద్యుత్, ట్రాన్స్పోర్ట్, పశువైద్యానికి అదనపు ఖర్చులు తప్పవు. ఒక్కో గేదె రోజుకు 12- 20 లీటర్ల పాలు ఇస్తుంది. ఇలా రోజుకు రెండుసార్లు కలిపి నరేశ్, ఉపేందర్‌రావు 250 నుంచి 300 లీటర్ల పాలు సేకరిస్తారు. అలాగే పేడ విక్రయం ద్వారా మరికొంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం డెయిరీ నిర్వాహకులకు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్లలో మత్స్య పరిశ్రమకు నిధులు కేటాయించిన విధంగానే డెయిరీ నిర్వాహకులను ప్రోత్సహించాలని నరేశ్, ఉపేందర్‌రావు కోరుతున్నారు. డెయిరీ ఫాం నిర్వహణపై శిక్షణ ఇప్పించాలంటున్నారు.
పాడి పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రాయితీలు అందించి ప్రోత్సహించాలి. ఔత్సాహికులు, నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. పాడి పరిశ్రమలు స్థాపించడానికి సహకరించాలి. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో మాతో పాటు ప్రారంభించిన పది పాడిపరిశ్రమల్లో ఇప్పటికే ఏడు మూత పడ్డాయి. బ్యాంకులు మాకు రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడంలేదు. ఇప్పటికే రూ.కోటి వరకు పెట్టుబడి పెట్టాం. ఇతర ఖర్చులకు బయట వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి డెయిరీ నడుపుతున్నాం.
– దండా నరేశ్, డెయిరీ స్థాపకుడు, మునిగేపల్లి