మామిళ్లగూడెం, ఆగస్టు 24: భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయం జరిగేలా పరిహారాన్ని అందిస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. విజయవాడ – కాజీపేట మూడో రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించి మధిర, బోనకల్లు మండలాల్లో చేపడుతున్న భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులతోపాటు రైల్వే, రెవెన్యూ అధికారులతో బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులతో చర్చించి భూముల విలువలను నిర్ధారించారు.
మధిర మండలంలోని మడుపల్లి, దిడుగుపాడు, తొర్లపాడు గ్రామాలకు సంబంధించి 41 మంది రైతులు, బోనకల్లు మండలంలోని రామాపురం, ముష్టికుంట్ల, చిరునోముల, బోనకల్లు, మోటమర్రి గ్రామాలకు సంబంధించి 88 మంది రైతుల నుంచి భూములు సేకరించనున్నారు. ఈ సమావేశంలో రైతులను సంప్రదించి వారి అంగీకారం మేరకు ఎకరానికి రూ.15 లక్షల చొప్పన భూ విలువను నిర్ధారించి పరిహారం చెల్లించేందుకు నిర్ణయించారు.
ఈ భూ పరిహారాన్ని ఈ వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, విజయవాడ సౌత్ సెంట్రల్ రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సుధాకర్, ఏఈఈలు వెంకటేశ్వరరావు, వరుణ్, మధిర, బోనకల్లు తహసీల్దార్లు రాంబాబు, రాధిక, ఆయా మండలాల రైతులు పాల్గొన్నారు.