వినాయక చవితి సమీపిస్తోంది. ఊరూవాడా గణనాథుల సందడి కనిపించనున్నది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో పర్యావరణానికి ముప్పు వాటిల్లనున్నది. ప్రతిమలకు వినియోగించే కలర్స్‌తో నీటి కాలుష్యం ఏర్పడనున్నది. ఫలితంగా వివిధ రకాల చర్మ వ్యాధులు రానున్నాయి. దీంతో మట్టి వినాయకులనే ప్రతిష్ఠించేలా మండళ్ల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతేకాదు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, సామాజికకర్తలు మట్టి ప్రతిమలను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు మట్టి విగ్రహాలపై అవగాహన, ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పర్యావరణ, నీటి కాలుష్యం నుంచి గట్టెక్కాలంటే అందరూ మట్టితో చేసిన గణపతులనే పూజించాలి.
– కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 22
మట్టితో చేసిన గణపతులనే పూజిద్దాం. ఎంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేస్తే అంత భక్తి ఉన్నట్లు కాదు. ఎంత భక్తితో వినాయకుడిని కొలిచామన్నదే ముఖ్యం. భక్తిప్రవత్తులతోనే మూషికవాహనుడిని కొలుద్దాం. పోటీలు పడి ఏకదంతుడిని ఏర్పాటు చేయడం కాదు. భక్తిభావంతో ప్రకృతిని కాపాడేలా నిర్వాహకులు చర్యలు చేపట్టాలి. వినాయక చవితి వేడుకల్లో అంతర్లీనంగా పర్యావరణ పరిరక్షణ దాగి ఉంది. కానీ ఆ పండుగలోనే నీటిని, మట్టిని కలుషితం చేయడం వల్ల ఆ పండుగ విశిష్టతకు పూర్తి విఘాతం కలుగుతున్నది.
వినాయకుడిని ఎంత భక్తితో కొలిచామన్నది పక్కనపెడితే.. మండప నిర్వాహకులు విగ్రహాల ఎత్తులను పెంచుకుంటూపోతూ తమ ఆడంబరాలను ప్రదర్శిస్తున్నారు. వివిధ లోహాలు, ‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్’ రంగులతో తయారుచేసిన వినాయకుల ప్రతిమలను ఏర్పాటు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రకృతి గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కలర్స్ వాడడం వల్ల విగ్రహాలు అందంగా, కళాత్మకంగానూ ఉంటాయి.. అయితే ఆ అందం వెనుక ఒక భయంకరమైన విపత్తు ఉందని నిర్వాహకులు మరిచిపోతున్నారు.
‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్’లో కాల్షియం, సల్ఫేట్, నైట్రేట్, ఎనామిల్ రంగులతో సీసం, ఆర్సినిక్ వంటి విష పదార్థాలు ఉన్నాయి. దీన్ని విగ్రహాల తయారీలో ఉపయోగించడం.. వాటిని నిమజ్జనం చేయడం వల్ల అనేక వ్యాధులకు మూలకారణాలవుతున్నాయి. చెరువులు, సరస్సులు, నదుల్లో జల వనరులను కాపాడాలంటే వ్యర్థపదార్థాల వినియోగం తగ్గించడమే మేలు. విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, విష పదార్థాలు ఉపయోగించడం వల్ల వృక్ష, జంతుజీవనంపై ప్రభావం చూపిస్తున్నది. నీటిలో ఈ రసాయనాలు కలవడం వల్ల ఊపిరితిత్తులతోపాటు చర్మ, కంటి, రక్తసంబంధిత వ్యాధులు వస్తున్నాయి.
మట్టి విగ్రహాల ఏర్పాటుపై జిల్లావ్యాప్తంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాం. గత సంవత్సరం కూడా ప్రతి సెంటర్లో నిర్వహించి మట్టి వినాయక ప్రతిమలను అందజేశాం. వినాయక విగ్రహాల మండప నిర్వాహకులు ఆలోచించాలి. ప్రకృతి వనరులను కాపాడడం మనందరి బాధ్యత.
– వి.రవిశంకర్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్
పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం మట్టి గణపతులనే పూజించాలి. చెరువుల్లో నుంచి తెచ్చిన మట్టితో గణనాథుడిని తయారుచేయాలి. గత 20సంవత్సరాల నుంచి మట్టి గణపతిని తయారు చేసి పూజలు చేస్తున్నాం. మట్టి గణపతిని పూజించడం వల్ల ప్రకృతి, మానవాళి, నదుల్లోని జీవచరాలకు మంచిది. ఎన్ని అడుగుల విగ్రహాలు పెట్టామన్నది పక్కనపెట్టి మట్టి వినాయకులను నిష్ఠతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.
– కొండవీటి దత్తాత్రేయశర్మ, అర్చకుడు, ప్రగతినగర్ శివాలయం