తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 17: మండలంలోని ఏలువారిగూడెం, కాకరవాయిలోని రెండు ఇళ్లలో పట్టపగలే దొంగలు పడ్డారు. రూ.9 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.33 వేల నగదును అపహరించారు. బాధితుల కథనం ప్రకారం.. ఏలువారిగూడేనికి చెందిన తాటి ఉపేంద్రమ్మ గురువారం ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లింది. దుండగులు ఇంట్లోకి చొరబడి 8.5 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.3 వేల నగదును అపహరించి ఉడాయించారు. ఇదే రోజు కాకరవాయికి చెందిన బీరెడ్డి నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన నారాయణ ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించాడు. 10 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.30 వేల నగదు అపహరణకు గురైనట్లు నిర్ధారించుకున్నాడు. బాధితులిద్దరూ వేర్వేరుగా తిరుమలాయపాలెం పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలాలను సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై నందీప్ పరిశీలించారు. దుండగులు అపహరించిన ఆభరణాల విలువ రూ.9 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. ప్రత్యేక బృందాలతో విచారణ ప్రారంభించారు. పట్టపగలే రెండు గ్రామాల్లో చోరీలు చోటు చేసుకోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.