భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 22న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమానికి జిల్లా నుంచి జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, రైతుబంధు సమితి సభ్యులు, దేవస్థానాల కమిటీ సభ్యులు, చైర్మన్లు, సొసైటీల చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆయా శాఖల అధికారులు తరలివెళ్లాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శనివారం జిల్లాకేంద్రం నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పర్యటనకు నోడల్ అధికారులను నియమించామన్నారు. నోడల్ ఆఫీసర్లుగా ఆర్టీవో, అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో వ్యవహరిస్తారన్నారు. కొత్తగూడెం, భద్రాచలం నుంచి ప్రత్యేక వాహనాలు ఏర్పా టు చేశామన్నారు. బస్సుల్లో అల్పాహారం, భోజనం అందుతుందన్నారు. ప్రతిఒక్కరికీ ఐడీ కార్డులు అందుతాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో విద్యాలత, డీపీవో రమాకాం త్, డీసీవో వెంకటేశ్వర్లు, డీఏవో అభిమన్యుడు, జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, ఆర్టీవో వేణు, మార్కెటింగ్‌శాఖ అధికారి అలీం, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.