ఖమ్మం సిటీ, ఆగస్టు 17: ఆపత్కాలంలో రక్తాన్ని అందించే వారు ప్రాణదాతలతో సమానమని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని దానాల్లోకి రక్తదానం మిన్న అని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 8 నుంచి 22 వరకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగానే రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే తాను 15 నుంచి 20 దఫాలు రక్తదానం చేసినట్లు గుర్తుచేశారు. జిల్లాకు 500 యూనిట్లు అవసరం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని 750 యూనిట్లు సేకరణకు కార్యాచరణ రూపొందించామని అన్నారు. తెలంగాణ రెడ్ క్రాస్ ద్వారా రక్తదాతల నమోదుకు యాప్ రూపొందించామని, దీని ద్వారా 2500 మంది దాతలు నమోదయ్యారని వివరించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి, కార్పొరేటర్ బీజీ క్లెమెంట్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, డాక్టర్ కృపా ఉషశ్రీ, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అఫ్జల్‌హసన్, ఆర్వీఎస్ సాగర్ తదితరులు పాల్గొన్నారు..
యాభై మంది రక్తదానం..
రక్తదాన శిబిరంలో టీఎన్జీవోస్ నాయకులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు అఫ్జల్‌హసన్, కార్యదర్శి ఆర్వీఎస్ సాగర్, రఘునాథపాలెం టీఎన్జీవోస్ యూనిట్ అధ్యక్షురాలు సాయి శిరణ్మయి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఫోరమ్ సెక్రటరీ మురళీధర్ సహా మరో యాభై మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన వారికి డీఎంహెచ్‌వో ప్రశంసా పత్రాలు అందజేశారు. టీఎన్జీవోస్ బాధ్యులు నందగిరి శ్రీను, సామినేని రఘుకుమార్, శాబాసు జ్యోతి, స్వప్న, అశ్వనిరెడ్డి, కోడి లింగయ్య, వేణుగోపాల్, బుద్ద రామకృష్ణ, కూరపాటి శ్రీను, నాగుల్ మీరా, భాస్కర్, కత్తుల రవి, రమేశ్‌బాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.