ఖమ్మం, ఆగస్టు3 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): పోటెత్తిన గోదారితో వేల కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వరదలకు ముంపుప్రాంత వాసులు చిగురుటాకులా వణికిపోయారు. సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్న వారికి ఆశాదీపంలా తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. వారిని పునరావాస కేంద్రాలకు తరలించి సకల సౌకర్యాలు కల్పించింది. వరదల సమయంలో ముంపుప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీ మేరకు బుధవారం వరకు బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతున్నది. రెండు మూడ్రోజుల్లో అంద రికీ సాయం అందనున్నది. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
వరద సృష్టించిన బీభత్సంతో నిరాశ్రయులైన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నది. గత నెలలో భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో అత్యధిక వర్షాలు, గోదావరి వరదల వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు పూర్తిగా జలమయమయ్యాయి. సమస్తం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిన కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంలో పర్యటించిన సందర్భంగా ప్రకటించారు. ఆ తరువాత బాధితుల వివరాలను నమోదు చేసుకున్న అధికారులు వాటిని ప్రభుత్వానికి పంపడంతో సరిగ్గా 20 రోజుల వ్యవధిలోనే వారి బ్యాంకు ఖాతాల్లో ఈ పరిహారం నగదు జమ అవుతోంది.
దీంతో బాధిత కుటుంబాలకు కొంత ఊరట కలుగుతుండడంతో వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గత నెల 10 నుంచి నెలాఖరు వరకు ఎగువన కురిసిన వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగి జలప్రళయం సృష్టించింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. 71.03 అడుగుల గరిష్ఠ స్థాయికి గోదావరి నీటిమట్టం చేరడంతో భద్రాచలం, దుమ్ముగూడెం, పర్ణశాల, సారపాక, బూర్గంపహాడ్, అశ్వాపురం, ఏడూళ్ల బయ్యారం, పినపాక వంటి గ్రామాల్లో వేలాది కుటుంబాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో జూలై 17న జోరువానను సైతం లెక్కచేయకుండా రోడ్డుమార్గం ద్వారా భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్.. కరకట్టను, లోతట్టు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు.
పునరావాస శిబిరాలకు వెళ్లి బాధిత కటుంబాలతో మాట్లాడారు. వారు వెలిబుచ్చిన ఆవేదనకు చలించిన సీఎం కేసీఆర్.. వరద బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం భద్రాచలంలో జరిగిన జిల్లా అధికారుల సమీక్ష, మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తరలించి అక్కడ వారికి శాశ్వత ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రూ.వెయ్యి కోట్లు ప్రకటించారు. అలాగే వరద నీరు ఇళ్లలోకి చేరి సమస్తాన్నీ ఊడ్చేసుకు వెళ్లిన కుటుంబాలను ఆదుకునేందుకు కుటుంబానికి రూ.10 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. సీఎం ప్రకటించిన వెంటనే భద్రాద్రి, ఖమ్మం కలెక్టర్లు అనుదీప్, వీపీ గౌతమ్ ప్రత్యేక్ష పర్యవేక్షణలో మండలాల వారీగా బాధితుల జాబితాను రూపొందించారు.
అత్యధికంగా బూర్గంపహాడ్ మండలంలో 7,108 కుటుంబాలు వరద తాకిడికి గురైనట్లు గుర్తించిన అధికారులు వారికి రూ.10 వేల చొప్పున సహాయం అందించాలని నిర్ణయించారు. భద్రాచలంలో 1,431, దుమ్ముగూడెంలో 1,236, చర్లలో 2,289, అశ్వాపురంలో 1,535, పినపాకలో 1,343 కుటుంబాలను గుర్తించారు. మొత్తం 16,034 కుటుంబాలకు గాను ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమచేసే ప్రక్రియను ప్రారంభించింది. మరో రెండుమూడు రోజుల్లో బాధిత కుటుంబాలన్నింటికీ ఈ సాయం అందనుంది.
మాట నిలబెట్టుకునే ఏకైక ముఖ్యమంత్రి.. కేసీఆర్
మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండి ఆ మాటను నిలబెట్టుకునే ఏకైక ముఖ్యమంత్రి.. మన కేసీఆర్. వరద బాధితుల కష్టాలను కళ్లారా చూసిన ఆయన.. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల పరిహారం ఇస్తానని మాట ఇచ్చారు. ఆ విధంగానే నిధులు మంజూరు చేయడంతో వరద బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రెండో రోజులుగా రూ.10 వేల పరిహారం నగదు జమ అవుతోంది. అంతేగాక గోదావరి వరద నివారణకు సీఎం కేసీఆర్ రూ.1,000 కోట్లతో శాశ్వత పరిష్కారం చూపనున్నారు.
–రేగా కాంతారావు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే
బాధితుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది..
సీఎం కేసీఆర్, అజయ్‌కుమార్ చెప్పిన విధంగా గోదావరి వరదల్లో నిరాశ్రయులైన కుటుం బాలకు పరిహారం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. రెండు రోజులుగా వరద బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. బూర్గంపహాడ్ మండలంలో 7,108 మందికి వరద పరిహారం అందాల్సి ఉంది. ఇప్పటివరకు 5 వేల మంది తమ బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున నగదు జమ అయింది. మరో రెండు రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తవుతుంది.
-భగవాన్‌రెడ్డి, తహసీల్దార్, బూర్గంపహాడ్
వరద పరిహారం అందింది..
వరదలతో నిరాశ్రయులైన వారికి తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విధంగా తక్షణ పరిహారం అందింది. వరదల్లో సర్వం కోల్పోయిన ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తానని సీఎం కేసీఆర్ భద్రాచలం వచ్చిన రోజే ప్రకటించారు. ఆయన చెప్పిన విధంగానే మంగళవారం నా బ్యాంకు ఖాతాలో ఆ పరిహారం నగదు జమ అయింది. మా వార్డు పరిధిలోని మిగిలిన బాధితులకు కూడా ఈ పరిహారం అందింది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
తోకల సతీశ్‌కుమార్,వరద బాధితుడు, బూర్గంపహాడ్
ఆపద్బాంధవుడు..ముఖ్యమంత్రి కేసీఆర్..
ఆపదలో ఆదుకునే ఆపద్భాంధవుడు.. మన ముఖ్యమంత్రి కేసీఆర్. మొన్నటి గోదావరి వరదలతో నిరాశ్రయులుగా మారిన కుటుంబాలకు తోడుగా నిలిచారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానంటూ ప్రకటించారు. ఆ మాట ప్రకారమే ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం వెనువెంటనే పరిహారం అందించి అందరికీ దేవుడయ్యారు. వరద బాధితులందరూ సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు.
–చట్టు ఆంజనేయులు, వరద బాధితుడు,మసీద్ రోడ్, సారపాక