కూసుమంచి, ఆగస్టు 3: వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు, జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 1,503 చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు ఉండగా.. వాటిలో 90 శాతం నీరు చేరుకున్నది. పాలేరు, ఆకేరు, మున్నేరు చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. పాలేరు జలాశయం నుంచి నీరు విడుదల కావడంతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరుగుతుంన్నదని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో మిర్చికి డిమాండ్ ఉండడం, మంచి ధరలు పలుకుతుండడంతో మిర్చి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఆగస్టు రెండు లేదా మూడో వారంలో ఆయకట్టుకు సాగర్ జలాలు అందేవి. నీటిపారుదలశాఖ అధికారులు 2020లో ఆగస్టు 15న, గతేడాది ఆగస్టు 4న జలాలు విడుదల చేశారు. ఈ సారి ముందుగానే జూలై 20నే విడుదల చేశారు. పాలేరు జలాశయం ఆయకట్టు కింద 2.54 లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయి. ముందుగానే సాగు జలాలు విడుదల కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
సాగర్ జలాలు.. జిల్లా రైతుల పాలిట వరం.. లక్షలాది ఎకరాలకు సాగునీరు అం దించే వరప్రదాయిని.. బీడు భూములను సస్యశ్యామలం చేసిన ప్రాణదాయిని. ఏటా కురిసినట్లుగానే ఈ ఏడాది కూడా వానలు దండిగా కురుస్తున్నాయి. ఎగువన కురిసిన వర్షాలకు పాలేరు జలాశయంలోకి భారీగా వరద నీరు చేరింది. నీటిపారుదలశాఖ అధికారులు జూలై 20న సాగర్ జిలాలను దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్ ద్వారా జిల్లాలోని 18 మండలాల పరిధిలోని 2.54 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతున్నాయి. జిల్లాలో మొత్తం 1,503 నీటివనరులు ఉండగా వీటిలో 1,380 చెరువులు, మిగిలినవి చెక్‌డ్యాంలు. ప్రస్తుతం చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి.
పాలేరు జలాశయం నుంచి నీరు విడుదల కావడంతో రైతులు ముమ్మరంగా వ్యవసాయ పనులు చేపడుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో మిర్చికి మంచి డిమాండ్ ఉండడంతో గతంలో కంటే ఎక్కువగా మిర్చి విస్తీర్ణం పెరగనున్నది. గతంలో ఆగస్టులో రెండు లేదా మూడో వారంలో ఆయకట్టుకు సాగర్ జలాలు అందేవి. నీటిపారుదలశాఖ అధికారులు 2020లో ఆగస్టు 15న, గతేడాది ఆగస్టు 4న జలాలు విడుదల చేశారు. ఈసారి చాలా ముందుగా జూలై 20నే విడుదల చేశారు. ముందుగానే సాగు జలాలు పారడంతో రైతులు వ్యవసాయ పను ల్లో బిజీబిజీ అయ్యారు. మార్కెట్లో ఎరువుల కొరత లేదు. రైతుబంధు సాగుకు ముందే అందడంతో దర్జాగా సాగు పనులు చేసుకుంటున్నారు.
కూలీలు దొరకడం లేదు…
కూలీలకు చేతినిండా పని లభిస్తుండడంతో వారికి డిమాండ్ పెరిగింది. ముందస్తుగా డబ్బులు ఇచ్చినా కూలీలు దొరకడం లేదు. రైతులందరి పొలాలు, పత్తి పాట్లు, కలుపు తీసేందుకు ఒకే సమయానికి రావడంతో కూలీల కొరత ఏర్పడుతున్నది. గతంలో వర్షాలకు, ఎరువులకు, విత్తనాల కోసం ఎదురుచూసేది. కానీ నేడు అన్నీ సకాలంలో దొరకడంతో సాగుకు ఎలాంటి ఢోకా లేదు. సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి ఇవ్వడంతో రైతులు సంతోషంగా సాగు చేపడుతున్నారు.
–మందడి వెంకటరెడ్డి, జుఝల్రావుపేట, రైతు
నీటి వనరులకు జలకళ..
వరుసగా కురుస్తున్న వానలకు జిల్లాలో నీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. పాలేరు జలాశయం ఆయకట్టు కింద 2.54 లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయి. వైరా, లంకాసాగర్, బేతుపల్లి వంటి చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 1,503 చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు ఉండగా వాటిలో 90 శాతం నీరు చేరుకున్నది. పాలేరు, ఆకేరు, మున్నేరు చెక్‌డ్యాంలు జలాలతో నిండుగా దర్శనమిస్తున్నాయి. సాగునీటికి ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు.
– శంకర్‌నాయక్, నీటిపారుదలశాఖ సీఈ