ఖమ్మం రూరల్, ఆగస్టు 3: సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం నేడు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాలుగా దళితులను ఆయా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తే.. సీఎం కేసీఆర్ మాత్రం వారి జీవితాల్లో వెలుగులు తీసుకొస్తున్నారని గుర్తుచేశారు. పథకాన్ని వందశాతం సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్థిరత్వం పొందాలని, వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తేనే పథకానికి సార్థకత చేకూరినట్లవుతుందని అన్నారు. మండలంలోని తనగంపాడు గ్రామంలో దళితబంధు పథకం తొలి విడత యూనిట్ల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు దళితులు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు.
32 మంది లబ్ధిదారులకు రూ.3.20 కోట్ల విలువైన జేసీబీలు, ట్రాక్టర్లు, టాటా ఏస్‌లు, డీజేలు, ఇతర యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అశోక్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితబంధు యూనిట్లను అమ్ముకున్నా, కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరమని అన్నారు. స్వయం ఉపాధితో దళితులు ఆర్థికంగా ఎదిగి వారి పిల్లలు ఉన్నతంగా చదివించుకోవాలన్నదే దళితబంధు ప్రధాన ఉద్దేశమన్నారు. రూ.10 లక్షల విలువైన యూనిట్లను వంద శాతం రాయితీపై అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను ఆదరించాలని కోరారు.
తనగంపాడు గ్రామం అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. గతంలో ఈ గ్రామానికి రావాలంటే లోతైన వాగులు దాటాల్సి వచ్చేందని గుర్తుచేశారు. దీనిని అధిగమించేందుకు తానే స్వయంగా బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టానని, ఆర్థికంగా కొంత నష్టం వచ్చినప్పటికీ గ్రామస్తుల ఇబ్బందులు తొలగినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు బెల్లం ఉమ, వై.వరప్రసాద్, బెల్లం వేణు, గూడ సంజీవరెడ్డి, అక్కినపల్లి వెంకన్న, ముత్యం కృష్ణారావు, రవి, మైబెల్లి సాహెబ్, లక్ష్మణ్‌నాయక్, మంకెన నాగేశ్వరరావు, ఆంజనేయులు, ఏలూరి శ్రీనివాసరావు, దశరథం, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.