ఖమ్మం, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. రైతులకు బీమా ఇస్తున్నట్లుగానే చేనేత కార్మికులకూ బీమా పథకాన్ని అమలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ నెల 7వ తేదీ (జాతీయ చేనేత దినోత్సవం) ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నది. చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రైతుబీమా తరహాలోనే నేతన్న బీమా అమలు చేయనున్నది. బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి రూ.5 లక్షలను అందజేయనున్నది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేత వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ బీమా సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు జిల్లా పరిశ్రమలశాఖ, డీఆర్డీఏ, చేనేత, జౌళిశాఖలు సమన్వయంతో చేనేతలను గుర్తించేందుకు కార్యాచరణ రూపొందించాయి. చేనేత రంగంలో ఉన్నవారు, ప్రస్తుతం అనారోగ్యం, వృద్ధాప్యంతో వృత్తికి దూరంగా ఉన్నవారికి సైతం ఈ పథకాన్ని వర్తింప జేయాలని నిర్ణయించింది. దీంతో చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
ఆరుగాలం శ్రమించి ప్రపంచానికి చేనేత బట్టలు అందించే నేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసానిస్తూ బీమా పథకాన్ని అమలు చేయనున్నది. ఇప్పటికే నేత కార్మికులకు ఆసరా పెన్షన్ అందిస్తున్న సర్కార్ ఈ నెల 7 నుంచి ‘నేతన్న బీమా’ పేరుతో ఇన్సురెన్స్ పథకాన్ని ప్రారంభించనున్నది. ఆరోజు జాతీయ హ్యాండ్లూమ్ డే సందర్భంగా పథకాన్ని అమలు చేయనున్నది. ఇంటి యజమాని చనిపోతే కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఏ కారణంతో నేతన్న చనిపోయినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందించనున్నది. ఉమ్మడి జిల్లాలో నేత కార్మికుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ జిల్లా పరిశ్రమలశాఖ, డీఆర్డీఏ, చేనేత, జౌళిశాఖల అధికారులు వారందరికీ పథకం వర్తింపజేయనున్నారు. ఇప్పటికే బీమా ప్రక్రియ ప్రారంభించి లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వారి నుంచి ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం చేనేత రంగంలో ఉన్నవారు, వృద్ధులు, వృత్తికి దూరంగా ఉన్న వారికీ పథకం వర్తింపజేయనున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి చేనేత కుటుంబాలు ఉండగా వాటిలో 435 మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
సీఎం కేసీఆర్కు చేనేత కార్మికులంతా రుణపడి ఉంటారు. ఉమ్మడి పాలనలో చేనేత కార్మికులను పట్టించుకున్న పాలకులు లేరు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో రైతులతో సమానంగా చేనేత కార్మికులకు పథకాలు వర్తిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ‘నేతన్న బీమా’ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. సీఎం కేసీఆర్ చల్లగుండాలె.
– గుడ్ల వెంకటేశ్వర్లు, పాతర్లపాడు, చింతకాని మండలం
మా పనికి గుర్తింపు..
నేతన్న నేసే చీరెలు, పంచెలు, దుస్తులు జనమందిరి కోసం. మా పనికి ప్రభుత్వం తగిన గౌరవాన్నిస్తున్నది. నేతన్నలకు బీమా ఇస్తామని ప్రకటించినప్పుడు మా కుటుంబాలకు భరోసా వచ్చింది. పెద్ద దిక్కుగా సీఎం కేసీఆర్ మాకు అండగా నిలుస్తున్నారు. రైతాంగంతో పాటు మాకు రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తున్నారు. ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిలో నిలచిపోతారు.
– పిల్లలమర్రి కొండయ్య, చేనేత సహకార సంఘం సభ్యుడు, పాతర్లపాడు, చింతకాని మండలం
నేతన్నలను గుర్తించిన సీఎం కేసీఆర్
చేనేత కార్మికులను గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్. నేతన్నల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న సీఎంకు ధన్యవాదాలు. రైతులకు రైతుబీమా వర్తింపజేసినట్లు గానే చేనేత కార్మికులకు బీమా వర్తింపజేయడం అభినందనీయం. నేత కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ప్రభుతం తీసుకున్న నిర్ణయంపై చేనేత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
– వంగర రమేశ్, చేనేత కార్మికుడు, మాటూరుపేట, మధిర మండలం