కారేపల్లి, ఆగస్టు 2 : ఒకప్పుడు మహిళలు అంటే వంటగదికే పరిమితం. మహా అయితే వ్యవసాయ కూలీ లేదా ఉపాధి కూలీ. కానీ ఇప్పుడు ఆమె ఒక శక్తి. స్వయం సహాయక సంఘాలు వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి రుణాలతో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆర్థికంగా ఎదిగి తమ పిల్లలను చదివించుకుంటున్నారు. కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కారేపల్లి మండలంలో 76 గ్రామ సమాఖ్యలు ఉండగా వీటి పరిధిలో 1,200 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 12 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. గతేడాది బ్యాంక్ లింకేజీ ద్వారా 104 మంది, స్త్రీనిధి ద్వారా 72 మంది, మండల సమాఖ్య ద్వారా నలుగురు, గ్రామ సంఘాల ద్వారా ఇద్దరు, ఎస్‌హెచ్‌జీ సొంత నిధులతో ఒకరు చొప్పున రుణాలు పొంది ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు.
లబ్ధి ఇలా..
రుణాలు తీసుకున్న కొందరు మహిళలు మేకలు, గొర్రెలు, గేదెలు కొనుగోలు చేశారు. మరికొందరు పిండి మిల్లులు, కిరాణా దుకాణాలు, టైలరింగ్ షాపులు, బ్యూటీపార్లర్లు పెట్టుకున్నారు. మైక్రో ఫైనాన్స్ కింద రూ.50 వేల రుణం తీసుకున్న మహిళలు నెలకు రూ.1,530 చొప్పున 36 నెలల పాటు రుణం చెల్లించాల్సి ఉంది. స్త్రీనిధి రుణాల లబ్ధికి మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండాలి. పొదుపు సంఘాల్లో నిరంతరాయంగా లావాదేవీలు కొనసాగించాలి. గ్రామ సంఘాలు, మహిళా సమాఖ్యలు సక్రమంగా పని చేస్తూ నెల నెలా సంఘాల నిర్వహణపై సమావేశం నిర్వహించాలి. సంఘాల పరిధిలోని మొబైల్ ఐవీఆర్ఎస్ పద్ధతి ద్వారా వ్యాపారం, వ్యవసాయం, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులతో పాటు ఇతర సామాజిక అవసరాలకు రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు, జీవనోపాధి ప్రణాళిక కింద రూ.25 నుంచి రూ.50 వేల వరకు సూక్ష్మ రుణాలు తీసుకోవచ్చు.
నాకు మంచి అవకాశం..
నేను గతంలో గృహిణిగా ఉండేదాన్ని. స్ఫూర్తి గ్రామసమాఖ్యలోని బాలాజీ స్వయం సహాయక సంఘంలో నేను ఒక సభ్యురాలుగా ఉన్నాను. బ్యాంక్ లింకేజి ద్వారా లక్ష, స్త్రీనిధి ద్వారా రూ.50వేల రూపాయల బుణం తీసుకున్నాను. సొంతంగా రూ.2లక్షలు మొత్తం మూడున్నర లక్షన్నరతో మాఇంట్లోనే పేపర్‌ప్లేట్స్, గ్లాసులు ఇతరాలు ఏర్పాటు చేసుకున్నాను. ఇంట్లో ఉంటూనే వ్యాపారం చేసుకుంటున్నాను. మంచి లాభసాటిగా ఉంది.
– బానోత్ గాయత్రి, మహిళా సంఘం సభ్యురాలు, బస్వాపురం
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి..
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్త్రీనిధి రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో 592 రూరల్ ఔట్లెట్లను లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటివరకు 385 మంది సభ్యులను గుర్తించాం. సభ్యులకు అతి తక్కువ వడ్డీకి రుణాలు అందుతున్నాయి. సులభమైన వాయిదా పద్ధతిలో నెల నెలా రుణాలు చెల్లించవచ్చు. –కె.సురేంద్రబాబు, ఇందిరా క్రాంతి పథకం ఏపీఎం, కారేపల్లి