కొత్తగూడెం క్రైం, ఆగస్టు 2: ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష రాసేందుకు వచ్చే ఉద్యోగార్థులకు కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డాక్టర్ వినీత్ జి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కేఎస్ఎం కళాశాలలో మంగళవారం పరీక్ష కేంద్రాల రీజినల్ కో-ఆర్డినేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈనెల 21న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనున్నదన్నారు. కొత్తగూడెంలోని 14 పరీక్షా కేంద్రాల్లో 6,108 మంది, భద్రాచలంలోని ఏడు పరీక్షా కేంద్రాల్లో 2,044 మంది పరీక్ష రాస్తారన్నారు.
బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. పరీక్షల నోడల్ అధికారిగా ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు వ్యవహరిస్తారన్నారు. కొత్తగూడెం కేంద్రాలకు మైనింగ్ కళాల ప్రిన్సిపాల్ పున్నం చందర్, భద్రాచలం కేంద్రాలకు ప్రభుత్వం కళాశాల ప్రిన్సిపాల్ భద్రయ్య రీజినల్ కో-ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారన్నారు. 21 పరీక్షా కేంద్రాలకు 21మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 21 మంది అబ్జర్వర్లను నియమించాలన్నారు. సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ స్వామి, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ మడిపెల్లి నాగరాజు, పీఆర్వో దాములూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
అభ్యర్థులకు సూచనలు..
– అభ్యర్థులు www.tslprb.in వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకుని దానిపై పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. కేంద్రానికి హాల్‌టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయిట్ పెన్నులు మాత్రమే వెంట తెచ్చుకోవాలి. సెల్ఫోన్లు, పెన్‌డ్రైవ్, బ్లూ టూత్, చేతి గడియారం, క్యాలిక్లేటర్లకు అనుమతి లేదు. ఎలాంటి అభరణాలు ధరించకూడదు. హ్యాండ్ బ్యాగులు, పౌచ్‌లు కేంద్రాల వద్ద భద్రపరిచే సౌకర్యం ఉండదు. బయోమెట్రిక్ ఉన్నందున చేతికి టాటూలు, మెహందీ లేకుండా చూసుకోవాలి. ఎఎంఆర్ షీట్లపై అనవసర రాతలు రాయరాదు. గుర్తులు పెట్టరాదు. వాటిని మాల్‌ప్రాక్టీస్ కింద పరిగణిస్తారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు టిక్ చేయాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్, ఉర్దూలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలో ఏమైనా సందేహాలు తలెత్తితే ఇంగ్లిష్ వర్షన్‌నే పరిగణలోకి తీసుకోవాలి.