రఘునాథపాలెం, ఆగస్టు 2: ఆయనో జిల్లా పాలనాధికారి. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం ఖమ్మంలోని ఓ పాఠశాల అభివృద్ధి పనుల పర్యవేక్షణకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ మధ్యాహ్న భోజనం సిద్ధమై ఉంది. విద్యార్థులు భోజనానికి ప్లేట్లు పట్టుకొని క్యూలో వెళ్తుండడాన్ని ఆయన గమనించారు. తనకూ ఓ ప్లేటు ఇమ్మని అడిగాడు. చిన్నారులతోపాటు తానూ ప్లేటు తీసుకొని మధ్యాహ్న భోజనం పట్టాడు. ఆ తరువాత విద్యార్థుల పక్కనే కూర్చొని మధ్యాహ్న భోజనం రుచి చూశారు. ఈ క్రమంలో విద్యార్థులతో మమేకమై వారితో ముచ్చటించారు. పాఠశాలలో సౌకర్యాలపై ఆరా తీశారు. ‘ఎలా చదువుతున్నారు? ఉపాధ్యాయులు సక్రమంగా పాఠాలు బోధిస్తున్నారా?’ అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆ తరువాత ‘మన ఊరు – మన బడి’ పనులను పరిశీలించారు. తదుపరి ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రంలోకి వెళ్లి పిల్లలకు అందించే పౌష్టికాహారం, గుడ్ల పరిమాణం, బరువు వంటి వాటిని పరిశీలించారు. టెలివిజన్ అందుబాటులో ఉండి వినియోగించకపోవడానికి గల కారణాలు తెలుసుకున్నారు. రిమోట్ చేతపట్టి సెట్టింగులు చేసి చూపించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పనుల పురోగతిపై ఆరా తీశారు. ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇలా ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మంగళవారం ‘మన ఊరు – మన బడి’ పనుల పర్యవేక్షణలో భాగంగా ఖమ్మం నగరం మల్లెమడుగు పాఠశాలల ఆకస్మిక తనిఖీ చేశారు. కార్పొరేటర్ నిరంజన్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, డీఈ స్వరూపారాణి, నవ్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు.