కల్లూరు, జూలై 27: ‘మన ఊరు – మన బడి’ పనులను పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్.. అధికారులను ఆదేశించారు. సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేయాలని, మాక్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. బుధవారం కల్లూరు మండలంలో పర్యటించిన ఆయన తొలుత కల్లూరు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం కల్లూరు బాలికోన్నత పాఠశాల ఆవరణలో జరుగుతున్న ‘మన ఊరు – మన బడి’ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరగతి గదుల్లో శుభ్రత పాటించాలని సూచించారు. విద్యార్థులు కూర్చునే బల్లలను ప్రభుత్వ పాఠశాలకు తరలించాలని ఎంపీడీవో రవికుమార్‌కు సూచించారు. విద్యార్థులకు వెంటనే యూనిఫాం అందించాలన్నారు.
తరువాత కాలువ కట్టపై పల్లెప్రకృతివనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు, అధికారులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థులతో ముచ్చటించారు. కొద్దిసేపు వారికి పాఠాలు బోధించారు. భవిష్యత్‌లో ఎంచుకోవాల్సిన గ్రూపులు, ఉద్యోగాలకు సంబంధించిన అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. మాక్ టెస్టులను పరిశీలించేందుకు తాను మరోసారి వస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రఘు కల్యాణి, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఎంపీడీవో రవికుమార్, ఎంపీవో వీరాస్వామి, రైతుబంధు సమితి సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.