పెనుబల్లి, జూలై 27: మండలంలోని తాళ్లపెంట రైతుల వందేళ్ల నిరీక్షణ ఫలించిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నేరుగా భూ పరిపాలన కమిషనర్ కార్యాలయం నుంచే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయని అన్నారు. ధరణి పోర్టల్‌తోనే భూముల రికార్డులు భద్రమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పాస్ పుస్తకాలకు నోచుకోని తాళ్లపెంట రైతులకు బుధవారం స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి బుధవారం పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాళ్లపెంట, కర్రాలపాడు రైతులకు చెందిన వేలాది ఎకరాల భూములకు సాంకేతిక కారణాల వల్ల పట్టాదారు పాస్ పుస్తకాలు రాకపోవడంతో అనేకసార్లు కలెక్టర్‌ను కలిసి విన్నవించామని, హైదరాబాద్ వెళ్లి సీసీఎల్ఏలో కూడా ఫిర్యాదు చేశామని అన్నారు. అధికారులు స్పందించి సర్వే నిర్వహించినట్లు గుర్తుచేశారు. ఒకటో, రెండో దశల్లో కలిపి 466 మంది రైతులకు సంబంధించిన 1,162.36 కుంటల భూమికి సీసీఎల్ఏ నుంచి నేరుగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయని వివరించారు. మిగతా 579 ఎకరాల భూముల సమస్యపై కూడా కలెక్టర్ దృష్టి సారించాలని కోరారు. వందేళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూముల సమస్యను 70 శాతం వరకూ పరిష్కరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
భూ సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్
భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ఇందుకోసం కొందరు అధికారులు రేయింబవళ్లూ పనిచేస్తున్నారని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. ధరణి పోర్టల్ వల్ల భూముల సమస్యలు పరిష్కారమవుతున్నాయని, క్రయవిక్రయాలు సులభమయ్యాయని అన్నారు.
అధికారులకు సన్మానం..
తాళ్లపెంట రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేందుకు నిరంతరం శ్రమించిన ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ రమాదేవి, సర్వేయర్ ఈశ్వరిబాయిలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర గౌతమ్ సత్కరించారు. అనంతరం తాళ్లపెంట భూముల సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్‌లను రైతులు సన్మానించారు.
‘నమస్తే’లో ప్రత్యేక కథనాలు..
కాగా, తాళ్లపెంట భూసమస్యలపై గతంలో చేపట్టిన ‘ధర్మగంట’ శీర్షిక ద్వారా ‘నమస్తే తెలంగాణ’ అనేక కథనాలు ప్రచురించింది. ‘వందేళ్ల నిరీక్షణ’ అనే కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించి సర్వే చేశారు. ఇన్ని రోజుల తర్వాత బాధితులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందాయి. ‘నమస్తే’ కథనాన్ని చదివే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్‌రావు, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, నాగరాజు, కనగాల వెంకటరావు, భూక్యా పంతులి, తేజావత్ తావూనాయక్, రాయపూడి మల్లయ్య, బాణోతు ఛత్రియా తదితరులు పాల్గొన్నారు.